అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ అనే పోస్టులు ప్రతి ప్రభుత్వానికి న్యాయపరమైన విషయాలలో సహకారం అందించడానికి ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో వాదనలు వినిపించడానికి ఉండే పోస్టులు.
సాధారణంగా రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చినప్పుడు తమకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండే నిపుణులైన న్యాయవాదులను ఈ కీలక బాధ్యతలలో నియమించుకుంటాయి. అయితే ఇవి రాజకీయ పోస్టులు కాదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలను గమనిస్తూ ఉంటే ఈ అడ్వకేట్ జనరల్ పోస్టులను కూడా రాజకీయ పోస్టుల లాగా కూటమి పార్టీలు పంచుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలో వివిధ పోస్టులలో ఉన్నశ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులను తొలగించారు. కొత్త అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమించారు. ఆయన గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన అనేక పిటిషన్లలో పిటిషనర్లకు అనుకూలంగా వాదించిన న్యాయవాది కావడం విశేషం.
అమరావతి కేసులను కూడా ఆయన వాదించారు. తెలుగుదేశానికి సంబంధించిన కేసులను కూడా అనేకం వాదించారు. అలా తెలుగుదేశంతో అనుబంధం ఉన్న న్యాయవాది అడ్వకేట్ జనరల్ అయ్యారు. ఒకసారి అడ్వకేట్ జనరల్ అయ్యాక ఇక తెలుగుదేశం పార్టీ కేసులు అనేం కాదు.. ప్రభుత్వం తరఫున అన్ని రకాల పిటిషన్లలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా వాదించడం జరుగుతూ ఉంటుంది.
అయితే పవన్ కళ్యాణ్ అదనపు అడ్వకేట్ జనరల్ పోస్ట్లు తమ పార్టీ తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా మీడియా మిత్రులకు సంకేతాలు ఇచ్చారు. ఇలాంటి పోస్టు రాజకీయ పోస్ట్ అని పవన్ అనుకుంటున్నారా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
సభాపతి స్థానంలో అయ్యన్నపాత్రుడు ఎన్నికైన తర్వాత ఉప సభాపతి స్థానం గురించి ఇంకా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ పోస్టును తమ పార్టీ తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఇంకా చర్చ సాగుతున్నదని పవన్ కళ్యాణ్ మీడియా మిత్రులతో చెప్పడం విశేషం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీకి మొత్తం మూడు మంత్రి పదవులు దక్కాయి.
బిజెపికి కేవలం ఒకే ఒక్క మంత్రి పదవి దక్కింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ను బిజెపికి కేటాయిస్తారని ఆ పార్టీ అధిష్టానం ఎవరి పేరు చెబితే వారు డిప్యూటీ అవుతారని కూడా ఒక ప్రచారం ఉంది. ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీకి చెందిన తెలుగుదేశం మూలాలు ఉన్న సుజనా చౌదరి డిప్యూటీ స్పీకర్ అవుతారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా జనసేన కూడా ఆ పోస్ట్ మీద కన్నేసినట్లుగా కనిపిస్తోంది.
నామినేటెడ్ పోస్టులను సంకీర్ణ ప్రభుత్వాల్లోని భాగస్వాములు పార్టీల వారీగా పంచుకోవడం సహజం గానీ.. అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ పోస్టులను కూడా పంచుకుంటారా అనేది ఆశ్చర్యకరంగా ఉంది.