శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతం అయిన అసెంబ్లీ నియోజకవరం ఆముదాలవలస అని చెప్పాలి. 1978లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయితే అత్యధిక సార్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఎక్కువ సార్లు ఎమ్మెల్యే గెలిచింది తమ్మినేని సీతారాం. వైసీపీలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం పనిచేశారు.
ఆముదాలవలసలో కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిస్తే టీడీపీ ఆరు సార్లు, వైసీపీ ఒకసారి గెలిచాయి. తమ్మినేని సీతారాం 1983 లో తొలిసారి గెలిచారు. ఆలా ఆయన మంత్రిగా చేశారు, స్పీకర్ గా పనిచేశారు. హవాను చాటుకున్నారు.
తమ్మినేని సీతారాం మేనల్లుడు కూన రవికుమార్ 2014లో తొలిసారి గెలిచారు. 2024లో గెలుపుతో ఆయన ఆముదాలవలసకు తానే అసలైన అల్లుడిని అని నిరూపించుకున్నారు. మేనమామ మీద ఈసారి పోటీలో భారీ మెజారిటీతో నెగ్గిన రవికుమార్ మంత్రి పదవి వస్తుందని ఆశించారు.
కానీ రాజకీయ సమీకరణల వల్ల అవకాశం దక్కలేదు. కానీ ఈ అయిదేళ్లలో ఏదో సందర్భంలో మంత్రిని అవుతాను అన్న ధీమా అయితే ఆయనలో ఉంది. దానికంటే ఎక్కువగా ఆముదాలవలసలో ప్రత్యర్ధి రాజకీయం చేయకుండా చేసుకోవడం ఆయనకు అసలైన విజయంగా చెబుతున్నారు.
ఏడు పదులకు చేరువ అయిన తమ్మినేనికి ఇవే చివరి ఎన్నికలుగా మారాయి. ఆయన రాజకీయ వారసుడు చివంజీవి నాగ్ ఎంతవరకూ రాజకీయంగా రాణిస్తారో చూడాలి. మేనమామ నుంచి రాజకీయం అంతా నేర్చిన కూన రవికుమార్ తమ్మినేని మాదిరిగానే కనీసంగా అయిదు సార్లకు తక్కువ కాకుండా గెలిచేందుకు రాజకీయ బాటలు వేసుకోవడం ఖాయమని అంటున్నారు.
టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆముదాలవలసలో రవికుమార్ కి సమీప భవిష్యత్తులో ఎదురులేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసి సొంత నియోజకవర్గానికి ఆదివారం వస్తున్న కూన రవికుమార్ కి ఘన స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో యువతరం ప్రతినిధిగా ఉన్న రవికుమార్ ఇంట గెలిచి రచ్చ గెలవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.