తెలుగుదేశం కూటమిలో చివరి నిముషంలో చేరి పోటీ చేసిన పది అసెంబ్లీ సీట్లలో రెండు తప్ప తక్కినవి అన్నీ గెలుచుకున్న బీజేపీకి విభజన ఏపీలో అతి పెద్ద విజయం దక్కింది అని చెప్పాలి. తెలంగాణలో బీభత్సంగా పోరాడినా ఎనిమిది ఎమ్మెల్యే సీట్లే బీజేపీకి దక్కాయి. ఏపీలో సునాయాసంగానే ఆ నంబర్ వచ్చింది.
దాంతో బీజేపీ శాసన సభా పక్ష నేత పదవికి పోటీ ఏర్పడింది. ఈ పదవి కోసం పార్టీలో ఉన్న వారు చాలా మందే ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. మిగిలిన వారు కొత్త వారు. అయితే రెండు సార్లు గెలిచిన విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కన్ను ఫ్లోర్ లీడర్ పోస్ట్ మీద ఉంది అని అంటున్నారు.
ఆయనకు గతంలో ఈ పదవిని పార్టీ ఇచ్చింది. 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ఫ్లోర్ లీడర్ గా పనిచేసి అనుభవం సంపాదించారు. ఇపుడు బీజేపీ ఎమ్మెల్యేలు డబుల్ అయ్యారు. దాంతో ఫ్లోర్ లీడర్ పోస్ట్ ఇంకా స్ట్రాంగ్ గా మారింది.
వీలుంటే మంత్రి పదవి లేకుండా ఫ్లోర్ లీడర్ పదవి రాజు గారికి దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారుట. టీడీపీ కూటమిలో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక పోస్ట్ అలాగే ఖాళీగా ఉంది. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కే మంత్రి పదవి ఇచ్చారు. దాంతో మరో పదవిని బీజేపీ కోరుతోంది.
దాని కోసం కూడా పోటీ చాలానే ఉంది. ఆ పోస్ట్ ఇస్తారా లేక డిప్యూటీ స్పీకర్ ఇస్తారా అన్నది కూడా తేలడంలేదు. ఆ రెండు పోస్టులలో ఏదో ఒకటి బీజేపీకి ఖాయం అని అంటున్నారు. ఆ పదవిని ఎవరికి ఇచ్చినా ఫ్లోర్ లీడర్ అయినా రాజు గారికి దక్కుతుందని ఆయన అనుచరులు ధీమాగా ఉన్నారు. బీజేపీ అధినాయకత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.