గ్రీన్ కార్డ్ కి గేట్లెత్తేస్తానంటున్న ట్రంప్

తమను గెలిపిస్తే ప్రజల్ని ఇలా ఉద్ధరిస్తాం అని రాజకీయ నాయకులు ఎన్నికల ముందు నోటికొచ్చిన వాగ్దానాలు ఇవ్వడం మన దేశంలో కొత్త కాదు. సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టి ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల వాగ్విన్యాసాలు చేస్తుంటారు.…

తమను గెలిపిస్తే ప్రజల్ని ఇలా ఉద్ధరిస్తాం అని రాజకీయ నాయకులు ఎన్నికల ముందు నోటికొచ్చిన వాగ్దానాలు ఇవ్వడం మన దేశంలో కొత్త కాదు. సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టి ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల వాగ్విన్యాసాలు చేస్తుంటారు. అది వాళ్ల మార్కెటింగులో భాగమనో, వారి రాజకీయ మానుగడకి అది తప్పదనో సరిపెట్టుకుని వింటూంటారు ప్రజలు. కొందరైతే ఆ వాగ్దానలని నమ్మి ఓట్లేస్తారు కూడా. అలా గెలిచిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. అయితే ఏది మాట్లాడినా ఓటర్లను ఆకట్టుకోవడానికి మాట్లాడతారు తప్ప వాళ్లని బెదరగొట్టే మాటలు మాట్లాడరు. 

కానీ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అందుకు భిన్నం. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని అమెరికా పౌరుల గుండెల్లో బాంబు పేల్చేలాంటి వాగ్దానం లాంటి అభిప్రాయమొకటి వెలిబుచ్చాడు. 

అదేంటంటే విద్యార్థులుగా అమెరికా వచ్చి ఆ డిగ్రీ ఏదో పూర్తిచేయగానే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాడట. ఎందుకని ఆరా తీస్తే, అమెరికాలో విద్యావంతులైన భారతీయులు, చైనీయులు వారి దేశాలకెళ్లి పోయి అక్కడ బిలియనీర్లు అయిపోతున్నారట, ఎందరికో ఉద్యోగాలిచ్చేస్తున్నారట. అదేదో అమెరికాలోనే వాళ్లు చేసేట్టుగా వెసులుబాటు కల్పించాలంటే డిగ్రీ పూర్తవ్వగానే గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలంటున్నాడు. 

భారతీయ విద్యార్థులకి ఈ వార్త సంబరంగానే ఉంటుంది కానీ అసలు వాళ్లు ఓటర్లే కారు. పోనీ పౌరుల్లో ఏ వర్గానికి ఈ ప్రక్రియ ఆనందాన్నిస్తుందో గమనిస్తే ఎవ్వరికీ ఇవ్వదు అని అర్ధమవుతోంది.

ఎందుకంటే ఇప్పటికే విదేశాల నుంచి వస్తున్న విద్యార్థుల వల్ల తమకి ఉద్యోగాలు దొరకట్లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.

ఇప్పుడీ గ్రీన్ కార్డ్ పాలసీతో వరదలా ఉన్న వలసలు ఇక సునామీలౌతాయని వాళ్లకి భయం వేస్తుంది. 

పోనీ వెళ్లిన వాళ్లందరికీ ఉద్యోగాలొచ్చేస్తున్నాయా అంటే కాంపిటీషన్ 1:10 రేషియోలో ఉంది.

పైగా చదివి ఉద్యోగం సంపాదించో, లేక ఆన్సైట్ జాబ్ మీద నేరుగా అమెరికాలో ల్యాండైన వారికో గ్రీన్ కార్డ్ రావాలంటే దశాబ్దాల నిరీక్షణ నడుస్తోంది. 

ఈ పరిస్థితుల్లో జస్ట్ రెండేళ్లు విద్యార్థులుగా కాలక్షేపం చేసేస్తే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందంటే ఇక అమెరికా మీద క్రేజెందుకుంటుంది?

పోనీ గ్రీన్ కార్డ్ రాగానే విద్యార్థులకి కలిగే వెసులుబాటేంటి?

ఒకే ఒక్కటి!

ఉద్యోగం లేకపోయినా ఇండియాకి వెళ్లిపోనక్కర్లేదు. ఎవ్వరూ దేశంలోంచి గెంటేయరు. హెచ్-1 బి ల టెన్షన్ ఉండదు.

అంతవరకూ ఓకే. 

మరి ఉద్యోగం లేకుండా అమెరికాలో బతకడం ఎలా? 

సింపుల్.. దీనికి మనవాళ్లు రెడీయే.. చదివింది ఏదైనా, దేశం నుంచి పొమ్మనకుండా ఉండాలే కాని నాలుగు డాలర్లు వస్తాయంటే ఏ పనైనా చేసేస్తారు.

ఆ రకంగా డ్రైవర్లుగానో, ప్లంబర్లుగానో, ఎలెక్ట్రీషియన్స్ గానో, బార్బర్స్ గానో సెటిలైపోయి ఆ బాపతు సేవలన్నీ సరసమైన ధరలకి అమెరికా వారికి అందిస్తారు. ఈ పనులు ఆల్రెడీ భయం భయంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గా ఉంటూ చేస్తున్న వారు ఉన్నారు. ఇక ఆ భయం లేకుండా లీగల్ గా చేసుకుంటారు.

ఆ తరహా జీవితం గడపడానికి ప్లానింగ్ ఉంటే మనవాళ్లు 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి గ్రీన్ కార్డ్ సంపాదించేస్తారన్నమాట.

అంతే మరి! అమెరికాలో ఏ మారుమూల యూనివర్సిటీలోనో ఆ మాత్రం ఫీజు కడితే చాలు అడ్మిషన్ వచ్చేస్తుంది. అక్కడ రెండేళ్లు బతకడానికి అదనంగా మరొక 40 లక్షల రూపాయలు. అంతా కలిపి కోటి లోపే. 

ప్రస్తుతం త్వరితగతిన గ్రీన్ కార్డ్ పొందాలంటే ఈబీ5 వీసా పొందాలి. దానికి దాదాపు ఐదు కోట్ల పైచిలుకు ఖర్చు చేయాలి. అంత అవసరం లేకుండా కోటి లోపే పనైపోతుందన్నమాట స్టూడెంటుగా అమెరికాలో అడ్మిషన్ సంపాదించగలిగితే. 

అమెరికాలో వేలాది యూనివర్సిటీలున్నాయి. ట్రంప్ గారి గ్రీన్ కార్డ్ పాలసీ వల్ల మనవాళ్లకి వేలంవెర్రి పెరిగితే ఆ యూనివర్సిటీలు ఫీజులు పెంచుతాయి. డిమాండుని బట్టి ఫీజు.. అంతే కదా! ఆ రకంగా అమెరికాకి కొత్తగా కోటానుకోట్లు వచ్చిపడతాయి. బహుశా ట్రంప్ లెక్క ఇదేనేమో. 

ప్రస్తుతం ఏడాదికి దాదాపు మూడు లక్షలమంది విద్యార్థులు ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నారు. ఈ గ్రీన్ కార్డ్ పాలసీ కనుక అమల్లోకి వస్తే ఆ లెక్క నాలుగింతలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇండియాలో మనవాళ్లు ఇంజనీరింగ్ కాలేజీలని ఎలా నింపేస్తున్నారో ఆ రకం మానియా అమెరికా యునివర్సిటీల మీద చూపిస్తారు. పైగా ట్రంప్ విజనేంటంటే ఈ పాలసీని జూనియర్ కాలేజీల విద్యార్థులకి కూడా అమలు చేయాలనట. అంటే ఇక ఇండియాలో అందరి తల్లిదండ్రులకి అమెరికా పిచ్చ ఎక్కిస్తున్నాడనుకోవచ్చు. 

ఇదే జరిగితే రానున్న పదేళ్లల్లో ఇండియాలో సగం జనాభా అమెరికాలోనే ఉంటుందేమో. గ్రీన్ కార్డంటూ చేతిలో ఉంటే బతకడం మనవాళ్లకి చెప్పక్కర్లేదు కదా! రోడ్ మీద పానీపూరీ బండి పెట్టేసుకునైనా బతికేస్తారు. 

అయితే ఇక్కడ బేతాళప్రశ్న ఏంటంటే స్థానిక ఓటర్లకి ఏ మాత్రం మింగుడుపడని ఈ వాగ్దానం ట్రంప్ ఎందుకు చేసాడా అని!

పోనీ తాను అనుకున్నట్టు అమెరికాలో చదువుకుని వెనక్కి వెళ్లిపోయి బిలియనీర్లు అయ్యే జనాన్ని గ్రీన్ కార్డుతో ఆపగలడా? 

ఎంతో మంది ఎన్నారైలు సిటిజెన్స్ అయినా కానీ ఇండియాలో డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు. 

తాజాగా ఇదే విషయంలో ఒక పెద్ద వార్త వచ్చింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఎన్నారైలు 1 బిలియన్ డాలర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసారట. అంటే దాదాపు 8,300 కోట్ల రూపాయలు.

ఇక్కడ షేర్ మార్కెట్లో పెడుతున్నారు, ఇళ్లు కొంటున్నారు, పోలాలు కొంటున్నారు.. అమెరికాలోని తమ సంపాదనని ఇండియాలో ధారపోస్తున్నారు.

గ్రీన్ కార్డ్లు, సిటిజెన్ షిప్పులు ఉన్నా కూడా వాళ్లా పని చేస్తున్నారు.

మరి ఈ కొత్త గ్రీన్ కార్డ్ పాలసీతో ట్రంప్ ఏమి సాధించాలనుకుంటున్నాడో తెలియట్లేదు. 

అసలు తన ఓటర్లలో ఎవర్ని రంజింపజేయడానికి అన్నాడో, ఏ ఆలోచనతో అన్నాడో అంతుబట్టట్లేదు. ఈ పాయింటుని డెమాక్రాట్ పార్టీ వారు ఆయుధంలా వాడుకుని ట్రంప్ వ్యతిరేక ప్రచారం చేసుకోవచ్చు. అలాంటి గ్రీన్ కార్డ్ పాలసీతో అమెరికాకి కలిగే అరిష్టాలేవిటో ఏకరువు పెట్టొచ్చు. ట్రంప్ ఆలోచనలో ఎంత డొల్లతనముందో ఓటర్లకి వివరించవచ్చు. 

అదలా ఉంటే..ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్టు…ఈ వార్త విన్న భారతీయులు అప్పుడే ఊహల్లో మేడలు కట్టేసుకుంటున్నారు.

హెచ్ 1 ని మర్చిపోయి గ్రీన్ కార్డ్ కోసం పచ్చనైన కలలు కనడం మొదలెట్టేసారు.

ఏదో కంపెనీలో పనిచేస్తూ ఆన్సైట్ అవకాశం కోసం చూస్తున్నవారు కూడా అవసరమైతే ఉద్యోగం మానేసి అమెరికాలో ఏదో ఒక యూనివెర్సిటీలో స్టూడెంటుగా అడ్మిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే డ్రీములు డ్రీముతున్నారు.

అమెరికాలో క్రైం రేట్ రోజురోజుకి పెరుగుతోందన్నా, అక్కడ డ్రగ్స్ మహమ్మారి లీగలైజ్ అయిపోయిందన్నా మనవాళ్లకి అమెరికా మోజు తగ్గట్లేదు. 

“నువ్విప్పుడు అమెరికా వెళ్లినా గ్రీన్ కార్డ్ నీకీ జన్మకి రాదోయ్. అంతమంది క్యూలో ఉన్నారు” అని చెప్పినా కూడా లక్షల మంది వెళ్లిపోతున్నారు. ఇక గ్రీన్ కార్డ్ కి గేట్లెత్తితే ఎక్కడాగుతారు!  

ఇదిలా ఉంటే ఆల్రెడీ అమెరికాలో హెచ్ 1 వీసా మీద ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నవారు కూడా లోకల్ గా ఏదో ఒక యూనివెర్సిటీలో చేరితే రెండేళ్లల్లో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది కదా అనుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు. దానికి తోడు వీళ్లు రెసిడెంట్స్ కాబట్టి చవకలో అయిపోతుంది. ఫీజుల మోత అంత ఉండదు. 

ఇలా ఎవరి మెరుపుకలలు వాళ్లు కంటున్నారు! 

ముందు ఎన్నికలవ్వాలి. ట్రంప్ గెలవాలి. గెలిచినా ఈ పాలసీని అమలు చేయాలి. చెప్పినంత తేలిక కాదు, అమలు చేయడం.

అయినా ఈ మహానుభావుడే అమెరికా వికాసానికి హెచ్ 1 వీసాలు అడ్డంకిగా ఉన్నాయని వాటిని బాగా టైట్ చేసి, తన హయాములో ఇమ్మిగ్రెంట్ పాలసీని చాలా కాంప్లికేట్ చేసిన వ్యక్తి. ఇప్పుడేమో పూర్తి రివర్స్ లో మాట్లాడుతున్నాడు. 

ర్యాడికల్ గా, విప్లవాత్మకంగా, వినూత్నంగా మాట్లాడడం ట్రంప్ కి అలవాటే. ఇప్పటికిలా చెప్పినా తరవాత మళ్లీ దీనిని కాస్త సరిదిద్ది మరొకటేదో చెప్తాడని కొందరంటున్నారు. ఏం జరగబోతోందో చూడాలి. 

– శ్రీనివాసమూర్తి