కేజ్రీవాల్‌కు బెయిల్ ద‌క్కిన‌ట్టే ద‌క్కి…షాక్‌!

ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్ ద‌క్కిన‌ట్టే ద‌క్కి, విడుద‌ల‌య్యే స‌మ‌యంలో ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్క‌ర్ స్కామ్‌లో కేజ్రీవాల్ జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు ట్ర‌యిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.…

ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్ ద‌క్కిన‌ట్టే ద‌క్కి, విడుద‌ల‌య్యే స‌మ‌యంలో ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్క‌ర్ స్కామ్‌లో కేజ్రీవాల్ జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు ట్ర‌యిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సంద‌ర్భంగా కోర్టు ష‌ర‌తులు విధించింది.

విచార‌ణ‌కు ఆటంకం క‌లిగించొద్ద‌ని, సాక్ష్యుల్ని ప్ర‌భావితం చేయ‌కూడ‌ద‌ని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు విచార‌ణ నిమిత్తం న్యాయ‌స్థానానికి హాజ‌రు కావాల‌ని కేజ్రీవాల్‌కు బెయిల్ సంద‌ర్భంగా ట్ర‌యిల్ కోర్టు ష‌ర‌తులు పెట్టింది. దీంతో ఇవాళ ఆయ‌న బెయిల్‌పై విడుద‌ల కావాల్సి వుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ట్ర‌యిల్ కోర్టు ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది.

అత్య‌వ‌స‌రంగా త‌మ పిటిష‌న్‌పై విచార‌ణ చేయాల‌ని న్యాయ‌స్థానాన్ని ఈడీ కోరింది. పిటిష‌న్‌ను స్వీక‌రించిన ఢిల్లీ హైకోర్టు… తాము విచార‌ణ జ‌రిపి బెయిల్‌పై నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కూ కేజ్రీవాల్‌ను విడుద‌ల చేయొద్ద‌ని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ విడుద‌ల వాయిదా ప‌డింది.

త‌మ నాయ‌కుడికి బెయిల్ మంజూరు చేస్తూ ట్ర‌యిల్ కోర్టు తీర్పు ఇవ్వ‌డంపై ఆప్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకున్నారు. కేజ్రీవాల్ విడుద‌లైన వెంట‌నే నీటి స‌మ‌స్య‌పై పోరాటం చేయాల‌ని వారంతా ఉత్సాహంగా ఎదురు చూడ‌సాగారు. కానీ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ ట్ర‌యిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో ఆప్ కార్య‌క‌ర్త‌ల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది.