ఆదాయ వనరులపై వైసీపీ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో రాజకీయాలకు కొంత కాలం విరామం ఇవ్వాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తానిచ్చిన హామీల్ని అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని వైసీపీ నాయకులు నిర్ణయించారు. దీంతో కొంతకాలం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలకు దిగకూడదని జగన్‌తో సహా ఆ పార్టీ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
దీంతో రాజకీయ కార్యకలాపాలకు కొంత కాలం స్వస్తి చెప్పి, ఆదాయ మార్గాలను వెతుక్కునే పనిలో వైసీపీ నేతలున్నారు. అది కూడా ఏపీలో కాకుండా, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంతకాలం వైసీపీ అధికారంలో ఉండడంతో కొంత మంది నాయకులు వ్యాపారాలను పక్కన పెట్టారు. ప్రస్తుతం ఓటమి అనంతరం వైసీపీ నేతల ఆలోచనలన్నీ వ్యాపారాలపైనే ఉన్నాయి.
మళ్లీ ఎన్నికల నాటికి చేతిలో కాసింత డబ్బు పెట్టుకోడానికి వ్యాపార మార్గం తప్ప, మరో దారి లేదని వైసీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మళ్లీ వైఎస్ జగన్ పొలిటికల్ యాక్టివిటీకి సిద్ధమయ్యే పరిస్థితి. ఆ సమయానికి వ్యాపారాల్ని ఒక కొలిక్కి తెచ్చుకోడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తమకున్న రాజకీయ సంబంధాలు, పరిచయాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.