విశాఖ ఉక్కు అమ్మకం ఇప్పట్లో లేదు… ఇదీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్టేట్ మెంట్.
చూసారా.. కూటమి ఎంపీల ప్రతాపం… అనేది మద్దతు దారుల హడావుడి. పట్టుమని పది రోజులు కాలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ వెళ్లి ఢిల్లీలో అడుగు పెట్టలేదు. కేంద్రం మీద వత్తిడి తెచ్చిన సూచనలు లేవు. మరి ఎలా అమ్మకం ఆగింది? అంటే భాజపా ప్రభుత్వం తమ భాగస్వాముల మనోగతం మేరకు ఇలా డిసైడ్ అయిందా?
ఇన్ని ప్రశ్నల కన్నా ఒక్క ప్రశ్న చాలు.. నిజంగా ఉక్కు అమ్మకం ఆగిందా?
కేంద్ర మంత్రి ఏమన్నారు? ఉక్కు అమ్మకం ఇప్పట్లో లేదు అన్నారు. అంతే కానీ లేదు అనలేదు. ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు విశాఖ ఉక్కు పరిస్థితి ఎలా వుంది? వెంటిలేటర్ మీద వున్న పేషెంట్ పరిస్థితిలా వుంది.
ముడిసరుకు లేదు.. ఉత్పాదన సగానికి సగం పడిపోయింది. ఆ ఉత్పాదన వల్ల కూడా ఆదాయం రావడం లేదు. ఇప్పటికే పెట్టుబడి సాయం చేసిన వారు పట్టుకుపోతున్నారు. విశాఖ ఉక్కు ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన రెండు స్కూళ్ల విషయంలో చేతులు ఎత్తేసి, మీ దారి మీరు చూసుకోండి. జీతాలు ఇవ్వలేము అని చెప్పేసారు. మరో పక్క విశాఖ ఉక్కుకు వున్న ఒక్కో ఆస్తిని సైలంట్ గా అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో వున్న స్టాక్ యార్డ్ ను అమ్మకానికి పెట్టేసారు.
ఢిల్లీ, బెంగళూరు, ముంబాయి, హైదరాబాద్ ల్లో వున్న ఆఫీసులు, గెస్ట్ హవుస్ లు, స్టాక్ యార్డ్ లు ఇలా రకరకాల ఆస్తుల అమ్మకానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో ఆస్తులు అమ్మితే ఎంత వస్తుంది మహా అయితే అయిదు వందల కోట్లు. అదేమన్నా పట్టుకెళ్లి విశాఖ ఉక్కు కోసం వాడతారా? సమస్యే లేదు.
విశాఖ ఉక్కు రెక్కలు ఒక్కొక్కటిగా స్మూత్ గా, సైలెంట్ గా విరిచేస్తూ వస్తున్నారు. రెక్కలు లేని పక్షి ఎలా ఎగురుతుంది అనుకుంటున్నారు. విశాఖ ఉక్కు అమ్మకాలు తెలంగాణలో సాగించాలి అంటే స్టాక్ యార్ట్ అవసరం లేదా? మరి అమ్మేస్తున్నారు? అంటే ఏమిటని అర్ధం? విశాఖ ఉక్కు అమ్మకం ఆగలేదు.. కొన ‘సాగు’తోంది. కొనసాగుతుంది అనే కదా?
ఇప్పటికిప్పుడు విశాఖ ఉక్కును కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే భారీగా రేటు చెబుతారు కనుక. ఈ రెక్కలు అన్నీ విరిచేసి, కేవలం ప్లాంట్ ను మాత్రం వుంచి, అప్పుడు కోట్ చేస్తే రీజనబుల్ రేట్ పలుకుతుంది. కేవలం ఉత్పాదనకు మాత్రం వాడుకునేందుకు ఇప్పటికే ఆ వ్యాపారంలో వున్న ఎవరో ఒకరు ముందుకు వస్తారు. వాళ్లకు ఆల్ రెడీ మార్కెటింగ్ సదుపాయాలు అన్నీ వుండే వుంటాయి. వాళ్లకు ఈ గెస్ట్ హవుస్ లు, స్కూళ్లు ఇలాంటి భవ బంధాలు ఏవీ అక్కరలేదు. దీని వల్ల పడే ఉద్యోగులు భారం కూడా అవసరం లేదు.
కేవలం స్కెలిటన్ విత్ స్కెలిటన్ స్టాఫ్ ను తీసుకుంటే పెట్టుబడి తగ్గుతుంది. ఈ లోగా ఇలా ఒక్కో రెక్క కట్ చేసుకుంటూ కేంద్రం ఆదాయం తెచ్చుకుంటుంది.
అప్పటి వరకూ…
విశాఖ ఉక్కు అమ్మకం ఇప్పట్లో లేదు… అనే స్టేట్ మెంట్ వినిపిస్తూ వుండొచ్చు.
తప్పేం లేదు.. అశ్వద్ధామ హత: కుంజరహ: అనడంలో దోషం ఏముంది?
కానీ కూటమి ఎంపీలు ఆపేసారు అని సంబరాల స్టేట్ మెంట్ లు మాత్రం వికటిస్తాయి. అదే సమస్య.