పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌కల్యాణ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం కావడంతో చంద్రబాబు తర్వాత పవనే ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా పవన్ అన్న, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తన అమితానందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పదేళ్ల కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రస్థానం మొదలైందని ఆయన ప్రకటించారు. ఇంకా ఆ పోస్టులో ఏముందంటే…
“డిప్యూటీ C.M హోదాలో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది, తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కి వెళ్లాలి ‘పవన్ కళ్యాణ్ అను నేను’ అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల.
అసెంబ్లీకి రావడం, గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill. మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా చాలా సంతోషంగా & గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాలా అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను” అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు.
పవన్ రాజకీయ ఉన్నతి ముఖ్యంగా ఆయన కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఇటీవలి పరిణామాలు తెలియజేస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్లా ఓడిపోవడం, ఆ అవమానాన్ని దిగమింగుతూనే రాజకీయ ప్రస్థానాన్ని సాగించడం విశేషంగా చెప్పుకోవచ్చు. కూటమి ఏర్పాటు, ముఖ్యంగా బీజేపీని టీడీపీకి దగ్గర చేయడంలో పవన్ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడాయన డిప్యూటీ సీఎంగా ఎలాంటి పేరు తెచ్చుకోవాలో కాలం తేల్చాల్సి వుంది. కానీ తన పేరు నిలబెట్టుకుంటారనే విశ్వాసం మాత్రం జనసేన నుంచి వ్యక్తమవుతోంది.