మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో క్రికెటర్ కు దగ్గరైంది. ఇండియన్ క్రికెటర్ షమీని త్వరలోనే ఆమె పెళ్లాడనుంది. గడిచిన 2 రోజులుగా వినిపిస్తున్న పుకార్లు ఇవి. వీటిని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఖండించారు.
క్రికెటర్ షమీని సానియా మీర్జా పెళ్లాడబోతోందనే పుకార్లను తోసిపుచ్చారు ఇమ్రాన్. “ఇదంతా ఓ చెత్త” అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, షమీ-సానియా ఇప్పటివరకు కలుసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇమ్రాన్ ప్రకటనతో ఈ పుకార్లకు తెరపడింది.
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకుంది సానియా. కొడుకుతో కలిసి దుబాయ్ లో సెటిలైంది. అటు షమీ కూడా భార్య హసిన్ నుంచి విడిపోయాడు. వీళ్లిద్దరూ కలిస్తే చాలా బాగుంటుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అందుబాటులోకి రావడంతో.. చాలామంది వీళ్లిద్దర్ని పెళ్లి దుస్తుల్లో ఉన్నట్టు మార్ఫింగ్ ఫొటోలు క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో పెట్టారు. వీటన్నింటికీ సానియా తండ్రి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇకపై ఇలాంటివి ఆపాలని ఆయన కోరారు.
సానియా తండ్రి ఖండించినప్పటికీ చాలామంది నమ్మడం లేదు. ఎందుకంటే, గతంలో సానియా-షోయబ్ పెళ్లి-విడాకుల టైమ్ లో కూడా ఇమ్రాన్ ఇలానే వ్యవహరించారు. ప్రస్తుతం హజ్ యాత్రలో ఉంది సానియా.