ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆ పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆమె కలుసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించారు. ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన ఆమె కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపితం చేయడంపై దృష్టి సారించారు. అయితే షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకులు భావించగా, అందుకు విరుద్ధంగా మరింత బలహీనపడింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని అన్ని కమిటీలను రద్దు చేసినట్టు ఆమె ప్రకటించారు. త్వరలో కొత్త కమిటీలను వేస్తామని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ఎదుగులకు షర్మిలే అడ్డంకి అంటూ ఇటీవల ఆమెపై పెద్ద ఎత్తున సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆమెపై ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆమె అందుబాటులో వుండరనేది ప్రధాన విమర్శ. కనీసం సెల్‌ఫోన్‌లో మాట్లాడాలన్నా కుదరడం లేదని ఆమె వ్యతిరేకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
అలాగే ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఫండ్‌ను కూడా ఆమె దిగమింగారనే ఆరోపణలు సొంత పార్టీ నేతలు నుంచి రావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తనకు అనుకూలమైన వారికి కమిటీల్లో స్థానం కల్పించేందుకు షర్మిల, పాత వాటిని రద్దు చేశారనే టాక్ నడుస్తోంది. ఎన్ని చేసినా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పురోగతి సాధించడం మాత్రం అనుమానమే. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల పని చేస్తున్నారనే విమర్శ బలంగా వుంది.