అయినా.. జగన్ మారలేదు

151 నుంచి 11 స్ధానాలకు పడిపోయింది గ్రాఫ్. అయినా జగన్ మారలేదు. ఇప్పటికే అవే బీరాలు పలుకుతున్నారు. 2029 మనదే.. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ నే అంటూ. కలలు కనడంలో తప్పు లేదు. కానీ…

151 నుంచి 11 స్ధానాలకు పడిపోయింది గ్రాఫ్. అయినా జగన్ మారలేదు. ఇప్పటికే అవే బీరాలు పలుకుతున్నారు. 2029 మనదే.. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ నే అంటూ. కలలు కనడంలో తప్పు లేదు. కానీ వాటిని సాకారం చేసుకోవడానికి ఏం చేస్తున్నారు అన్నది కీలకం.

పది రోజులు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. పోలవరం.. జగన్ సర్వ నాశనం చేసారు. రాజధాని.. జగన్ భ్రష్టు పట్టించారు. ఆర్థిక వ్యవస్థ జగన్ కొల్ల గొట్టేసారు.. ఇలా రోజుకు ఒకటి వంతున జగన్ ను ఇంకా తూర్పార పడుతున్నారు. జనం ముందు శాశ్వతంగా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరి దీనికి జగన్ ఏం చేస్తున్నట్లు? దమ్ముంటే ముందు వాటికి సమర్ధవంతంగా సమాధానం చెప్పాలి. తిప్టి కొట్టాలి. పోలవరం విషయంలో తానేం చేసాను.. అసలు ఏం జరిగింది.. అన్నీ పక్కాగా లెక్కలతో వివరించాలి కదా. అంబటి లాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ఏమిటి? పోలవరం తనకే అర్థం కాలేదని, సంబంధిత మంత్రి అంటే జనం నవ్వరా?

ఆర్ధిక వ్యవస్ధ 2019 నాటికి ఎలా వుంది.. ఇప్పుడు ఎలా వుంది? 2014 నుంచి 2019 మధ్యలో ఎంత అప్పులు చేసారు. 2019 కి ఏ మేరకు నిధులు వున్నాయి. ఏ మేరకు పెండింగ్ బిల్లులు వున్నాయి అన్నది మీడియా ముందు వివరించి, సవాల్ విసరాలి కదా?

ఇలా ప్రతి విషయంలోనూ బలమైన కౌంటర్ ఇవ్వకుండా 2029 ఎలా అధికారంలోకి వచ్చేస్తారని కలలు కంటున్నారు. ఇప్పటికైనా పార్టీకి బలమైన, అన్నింటి మీద సంపూర్ణ అవగాహన వున్న నలుగురు స్పోక్స్ పర్సన్స్ ను పెట్టుకోవాలి. జగన్ కూడా మీడియా ముందుకు రావాలి. ధైర్యంగా ప్రశ్నలను ఎదుర్కోవాలి.

అవన్నీ చేయకుండా ఇలా బీరాలు పలకడం అంటే.. జగన్ మారలేదు.. 2029 కి ప్రభుత్వమూ మారదు అనుకోవాల్సి వుంటుంది.