వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. రెండు రోజుల కిందట ఒక ట్వీట్ చేశారు. న్యాయం చేయడం మాత్రమే కాదు.. న్యాయం చేసినట్లుగా కనిపించడం కూడా ముఖ్యం అని జగన్ ఆ ట్వీట్ లో సందేశం ఇచ్చారు. ఎన్నికలు పారదర్శకంగా జరగడం మాత్రమే కాదు.. జరిగినట్టు కనిపించడం కూడా ముఖ్యం అని.. అందుకు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగడం ఒక్కటే తరుణోపాయం అని ఆయన సూచించారు.
ఆ సంగతి ఎలా ఉన్నా ఆ సిద్ధాంతాన్ని ఆయన తన వ్యక్తిత్వానికి కూడా అలవాటు చేసుకోవాలి. ఆయన అనన్యమైన ప్రజల తీర్పుతో, ఒంటరిగా పోటీచేసి 151 సీట్లు గెలుచుకుని అయిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ఆయన హుందాగా ఉండడం మాత్రమే కాదు. హుందాగా ఉన్నట్టు కనిపించడం కూడా ముఖ్యం.
ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సాధారణంగా ప్రతిపక్షం అయినా, పాలకపక్షం అయినా అసెంబ్లీ సమావేశాలకు ముందు తమ ఎమ్మెల్యేలతో మీటింగు పెట్టుకుని సన్నాహకంగా విషయాలు చర్చించుకోవడం మామూలే. కానీ.. జగన్ తమ పార్టీ తరఫున రాష్ట్రంలో పోటీచేసిన అందరితోనూ కలిసి మీటింగు పెట్టారు. ఈ భేటీలో కూడా ఈవీఎం ల మీద ఆరోపణలు చేశారు. ఓడిపోయిన నాటినుంచి ఆయన ఏ విషయాలనైతే ప్రధానంగా చెబుతున్నారో.. వాటినే పునరుద్ఘాటించారు.
అవ్వతాతల ప్రేమ, అక్కచెల్లెమ్మల ప్రేమ ఏమైపోయింది.. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికీ అందజేస్తే వారి అభిమానం ఏమైపోయింది? అనే ఆశ్చర్యార్థకాలనే ఆయన ఆ సమావేశంలో కూడా చెప్పుకొచ్చారు. కానీ.. జగన్ ఆ మూడ్ నుంచి బయటకు రావాలి.
ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోతున్న జగన్.. ఓటమిని జీర్ణించుకోలేక సమర్థించుకునే మాటలను కట్టిపెట్టి హుందాగా కనిపించడం ముఖ్యం. పూలమ్మిన చోటనే కట్టెలమ్మినట్టు.. ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఎమ్మెల్యేగా ఉండడం ఆయనకు కష్టమే కావొచ్చు. కానీ ప్రజల తీర్పును గౌరవిస్తున్న నాయకుడిగా.. జగన్ హుందాగా ఉండడమూ మరియు హుందాగా కనిపించడమూ అలవాటు చేసుకోవాలి.