వైసీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారిలో ఉపాధ్యాయుల గురించి చెప్పుకోవాలి. జగన్ పాలనలో తాము తీవ్ర అవమానాలపాలయ్యామనే అక్కసుతో వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లంతా గంపగుత్తగా ఓట్లేశారు. జగన్ పాలనలో టీచర్లను ఇబ్బందులకు గురి చేసిన ఏకైక ఉన్నతాధికారికగా ప్రవీణ్ ప్రకాశ్ గురించి చెబుతారు. ఈయన జగన్ హయాంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు.
తమను బోధనేతర పనులకు ఎక్కువగా వాడుకున్నారని, అలాగే పిల్లల ముందు అవమానకరరీతిలో ప్రవీణ్ ప్రకాశ్ తిట్టారనేది టీచర్ల ప్రధాన ఆరోపణ. ప్రవీణ్ ప్రకాశ్ దెబ్బతో ఉద్యోగాలు చేయలేమని దయనీయ స్థితికి వచ్చామని టీచర్లు వాపోయే వారు. ఆర్థికపరమైన అంశాలు జగన్ ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత రావడం ఒక కారణమైతే, అన్నిటికి మించి ప్రవీణ్ ప్రకాశ్ వేధింపులు పతాకస్థాయికి చేరినట్టు చెబుతూ వచ్చారు. ఏది ఏమైతేనేం జగన్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులంతా ఓట్లు వేయడానికి ప్రధాన కారకుడిగా ప్రవీణ్ ప్రకాశ్ మిగిలారు.
ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రవీణ్ ప్రకాశ్‌ను పాఠశాల విద్యాశాఖ నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాశ్ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
పాఠశాల విద్యాశాఖలో కావాలని తాను ఎవరినీ అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని ప్రవీణ్ ప్రకాశ్ క్షమాపణలు చెప్పడం గమనార్హం. తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించానంటూ సోషల్ మీడియాలో ఎన్నో వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయితే తన ఉద్దేశం అవమానించడం కాదని, అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే అని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా తమను అవమానించేలా తాను ప్రవర్తించాననే భావనను మనసులో పెట్టుకోవద్దని ఆయన కోరారు.
ఒకే ఒక్క వీడియోతో ప్రవీణ్ తన బాధ్యత తీరిపోయిందని అనుకున్నారు. కానీ జగన్ అధికారాన్ని పోగొట్టడంలో ప్రవీణ్ తన వంతు పాత్రను దిగ్విజయంగా పోషించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ను ముంచి ఇప్పుడు పశ్చాత్తపం చెందడం వల్ల ఉపయోగం ఏముందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.