మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని స్వార్థమే రాజకీయంగా కొంప ముంచింది. ప్రజలకు, తనకు మధ్య మరెవరూ కనిపించకూడదనే స్వార్థమే ఆయన రాజకీయ పతనానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సచివాలయ – వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలనను మరింత చేరువ చేయడానికి ఉపయోగపడిన మాట వాస్తవమే. అయితే ఇందులో జగన్ మనసులో మరో ఆలోచన కూడా వుంది.
చివరికి తన పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా సంబంధం లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ నిధుల్ని జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా ఐదేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. ఈ క్రమంలో తన పార్టీకి ప్రాణమైన కార్యకర్తలు, గ్రామ నాయకుల్ని రాజకీయంగా చంపేశారు. పరిపాలనలో తమ భాగస్వామ్యం లేకుండా జగన్ చేయడాన్ని వైసీపీ కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేకపోయారు.
తమతో పని లేకుండా వాలంటీర్లతోనే ఎన్నికలు చేసుకునేలా జగన్ ఉన్నారనే ఉద్దేశంతో క్రమంగా వైసీపీకి కార్యకర్తలు దూరమయ్యారు. ఎంతో కష్టపడి జగన్ను సీఎంగా చేసుకుంటే, అధికారంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్లా గడపాల్సి వచ్చిందన్న ఆవేదన వారిని మానసికంగా కుంగదీసింది. రాజకీయాల్లో జగన్ ప్రమాదకరమైన గేమ్, చివరికి ఆయన్నే ముంచేసింది.
ప్రభుత్వాధినేతగా తాను తప్ప, మరెవరి పేరు వినపడకూడదు, కనపడకూడదని జగన్ ఐదేళ్లు పాలన సాగించారు. ఈ పిచ్చిలో నుంచే రైతు పట్టాదారు పాసుపుస్తకాలపై తన బొమ్మల్ని ముద్రించుకోవడం, అలాగే సర్వే రాళ్లపై కూడా తానే కనిపించడం పరాకాష్టగా చెప్పుకోవచ్చు. తాను అధికారంలోకి రావడానికి పనికొచ్చిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు… ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం లేకుండా చేయాలని అనుకోవడం వికటించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వ్యవస్థ అంటేనే… అన్ని రకాల భావజాలాలకు నిలయం. చిన్నోపెద్దో ప్రతి ఒక్కరి ప్రాతినిథ్యం వుండాలి. అప్పుడే రాజకీయ పార్టీ అయినా, ఒక సంస్థ అయినా… తమది అనే భావన అందులో పని చేసే వాళ్లకు వుంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత …అంతా తానే కనిపించాలనే జగన్ అత్యాశే ఆయన్ను, అందరికీ దూరం చేసింది. అసలు కార్యకర్తలతో సంబంధం లేకుండా, నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కనెక్షన్ పెట్టుకుని, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ వ్యూహం పన్నారు.
తనకే కాదు, జనానికి కూడా తెలివితేటలుంటాయని ఆయన మరిచిపోయినట్టున్నారు. ఎంతో కాలం జెండా మోసిన తమను విస్మరించినప్పుడు, మళ్లీ ఏ మనసుతో అధికారంలోకి తెచ్చుకోడానికి పని చేయాలనే ఆవేదనతో ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేశారు. అంతేకాదు, తమను విస్మరించారన్న అక్కసుతో కూటమికి మద్దతు పలికారు.
అందరూ బాగుండాలి, అందులో తానుండాలని జగన్ అనుకోలేదు. తన బాగు కోసం మాత్రమే అందరూ పని చేయాలనే జగన్ స్వార్థ చింతనే, ఆయన్ను నిలువునా ముంచింది. పెద్దలు నీతికథలు ఊరికే చెప్పరు. మన ఉన్నతి కోసం శ్రమించిన వారిని విస్మరిస్తే, అదే పతనం చేస్తుంది. అధికారం పోయిన తర్వాత జగన్కు వాలంటీర్లకు బదులు కార్యకర్తలు గుర్తుకు రావడం …అంతా కాల మహిమ.