భారత ప్రభుత్వానికి ఇప్పుడో కొత్త ఆందోళన మొదలైంది. నిజానికి ఇది కొత్తది కాదు, గతేడాది ఇబ్బంది పెట్టిన అంశమే. ఈ ఏడాది కూడా ఇది తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అదే డబ్బున్నోళ్ల వలసలు.
అవును.. భారత్ ను వీడుతున్న ధనవంతుల సంఖ్య ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. గతేడాది 5100 మంది భారతీయ మిలియనీర్లు దేశాన్ని వీడారు. ఈ ఏడాది ఈ సంఖ్య 4300 గా ఉండొచ్చని ఓ అంతర్జాతీయ సంస్థ అంచనా వేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. ప్రపంచంలోనే అత్యథిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతున్న భారత్ లో కోటీశ్వరులకు కొదవలేదు. అయితే ఈ కోటీశ్వరులు మాత్రం ఇతర దేశాల వైపు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా దుబాయ్, అమెరికా వైపు.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షా 28 వేల మంది ధనవంతులు తమతమ దేశాలు వీడి అమెరికా, దుబాయ్ కు వలస వెళ్తారనేది ఓ అంచనా. వీళ్లలో ఎక్కువమంది చైనా నుంచి ఉండగా, రెండో స్థానంలో యూకే, మూడో స్థానంలో ఇండియా ఉన్నాయి.
భద్రత, ఆర్థిక వెసులుబాట్లు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఖరీదైన జీవన శైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు లాంటి అంశాలు ఈ మిలియనీర్లను అమెరికా, దుబాయ్ వైపు వలస వెళ్లేలా చేస్తున్నాయి.
అయితే ఉన్నంతలో ఊరట కలిగించే అంశం ఏంటంటే.. ఇలా వలస వెళ్తున్న ధనవంతులు.. పూర్తిగా ఇండియాను వదిలేయడం లేదు. వాళ్లు భారత్ లో తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు, ఇండియాను రెండో ఇల్లుగా మార్చునేందుకు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆర్థికంగా ఇప్పటికిప్పుడు భారత్ కు వచ్చే నష్టం లేదంటున్నారు విశ్లేషకులు.