చంద్రబాబునాయుడు సర్కారులో ఇంకా మంత్రులు అందరూ బాధ్యతలను, చాంబర్లను స్వీకరించారో కూడా పూర్తిగా లెక్కతేలలేదు. తాము గెలిచినంత మాత్రాన.. అధికార్ల మీద కక్ష సాధింపు చర్యలు ఏమీ ఉండవని పదేపదే ప్రకటించిన.. చంద్రబాబునాయుడు సర్కారు.. ఆ మాటలన్నీ డొల్లేనని తేల్చేసింది. అధికారుల మీద కక్ష సాధింపు చర్యలను ఐఏఎస్ అధికార్లతోనే ప్రారంభించింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఐఏఎస్ అధికార్ల బదిలీలను చేపట్టిన సర్కారు.. జగన్మోహన్ రెడ్డి సర్కారులో కీలకపదవుల్లో ఉన్న వారికి పోస్టింగు ఇవ్వకుండా జీఏడీకి ఎటాచ్ చేసింది.
పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి లను జీఏడీకి ఎటాచ్ చేసారు. ముఖ్యశాఖలు అన్నింటికీ కొత్త ఐఏఎస్ అధికార్లను పోస్టు చేశారు. వీరిలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న, సీఆర్డీయే కమిషనర్ గా కాటమనేని భాస్కర్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఫలితాలు వెలువడిన నాటి నుంచే.. చంద్రబాబునాయుడు.. జగన్ సర్కారులో కీలక స్థానాల్లో ఉన్న అధికార్లను తేడాగా చూడడం ప్రారంభించారు. ఫలితాల తర్వాత.. శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన ఉన్నతాధికారులను కనీసం గేటు దాటి లోనికి కూడా రానివ్వ లేదు. ఆయన బాటలోనే మంత్రులు కూడా వ్యవహరించారు.
మునిసిపల్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పొంగూరు నారాయణ.. ఆ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఫైళ్లు తీసుకుని తన ఛాంబర్ కు వస్తే కనీసం లోనికి రానివ్వలేదు. ఫైళ్ల మీద సంతకాలు చేయకుండా తిప్పిపంపారు. ఇలా రెండు రోజుల పాటు గత ప్రభుత్వపు ఉన్నతాధికారుల్ని తీవ్రంగా అవమానించిన చంద్రబాబు అండ్ కోటరీ.. ఎట్టకేలకు వారి మీద వేటువేసే చర్యలకు ఉపక్రమించింది. వారిని జీఏడీకి అటాచ్ చేసి.. తమ అనుకూలురైన అధికార్లను కీలక పోస్టుల్లో పెట్టారు.
ఎంతో ముఖ్యమైన ఐఏఎస్ బదిలీలలో కూడా ఇది కేవలం కొంత భాగమేనని విశ్వసనీయంగా తెలుస్తోంది. రెండో విడతలో ఐపీఎస్ ల భారీ బదిలీలు ఉంటాయని, ఆ తర్వాత.. ఐఏఎస్ ల బదిలీలో మరో విడతలో ఇంకా భారీగా జరిగే అవకాశం ఉందని రాజధాని వర్గాలు పేర్కొంటున్నాయి.