తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉంది. జనసేన వంద శాతం స్కోరు చేయగా, కూటమిలోని తెదేపా, భాజపా లనుంచి కేవలం 11 మంది మాత్రం ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్లను వదిలించుకోవడానికి, లేదా, తమ పార్టీ గెలిచి అధికారంలో ఉన్నది గనుక.. తమకు ఏమైనా ఫేవర్ చేయగలదని ఆశించకుండా చేయడానికి.. చంద్రబాబునాయుడు భలే గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది.
గెలిచే స్థానాలను కోల్పోయి వచ్చారంటూ.. ఆయన ఓడిపోయిన అభ్యర్థులపై మండిపడుతున్నారు. ఇదంతా ఆస్తులన్నీ తగలేసుకుని ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వారిని వదిలంచుకోవడానికి చంద్రబాబు పన్నాగం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి సగవాసి బాలసుబ్రమణ్యం ఓడిపోయారు. ఆయన తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తెదేపాకు కంచుకోట లాంటి రాజంపేటలో ఓడిపోవడం ఏంటంటూ.. చంద్రబాబు మండిపడ్డారట. తానూ పవన్ కల్యాణూ కలిసి ప్రచారానికి వచ్చి సభ పెట్టి.. రాజంపేటకు బోలెడు హామీలు ఇచ్చినా కూడా ఓడిపోవడాన్ని ఆయన తప్పుపట్టారట.
అయితే.. సగవాసి మాత్రం వైకాపా నుంచి చివరి నిమిషంలో తెదేపాలో చేరిన వారు తనకోసం మనస్ఫూర్తిగా పనిచేయలేదని, వైసీపీ భారీగా నిధులు ఖర్చు పెట్టిందని చెప్పబోయినా చంద్రబాబు వినిపించుకోలేదట.
రెండు రోజుల కిందట చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డితో కూడా చంద్రబాబు ఇదే మాదిరి ఆగ్రహం వ్యక్తం చేశారట. గెలవాల్సిన స్థానంలో ఓడిపోయారంటూ మండిపడ్డారట. నిజానికి తంబళ్లపల్లెలో తెలుగుదేశం గెలిచే అవకాశమే లేదనే అభిప్రాయంతో.. ఒక దశలో ఆ సీటును భాజపాకు అంటగట్టడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. అదంతా మరచిపోయి.. గెలవాల్సిన సీటు.. అంటూ ఇప్పుడు చంద్రబాబు కోపం ప్రదర్శించడం కేవలం ఒక నాటకం అని పలువురు అంటున్నారు.
పార్టీ అధికారంలో ఉన్నది గనుక.. కోట్లకు కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓడిపోయిన వారు.. ఇప్పుడు తమకు ఏమైనా పదవులు కావాలని అడగకుండా ఉండేందుకు.. చంద్రబాబు ఇలా వారిమీద ముందే దాడిచేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ టక్కుటమార విద్యలతో వారిని వదిలించుకుంటే బెటర్ అని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.