వారాహి యాత్రలో ఉన్న జనసేనాని పవన్‌కల్యాణ్ నోటి దురుసు ఆయనకు రాజకీయంగా వ్యతిరేకత తెస్తోంది. తన మాటలు రాజకీయంగా జనసేనకు నష్టం కలిగిస్తున్నాయని పవన్‌కు ఎవరూ చెప్పేవాళ్లు కూడా కనిపించడం లేదు. ఇవాళ కూడా వాలంటీర్లపై మళ్లీ నోరు పారేసుకున్నారు. వాలంటీర్లపై నోరు జారి…రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు గురి అవుతున్నానని తెలిసినా, దిద్దుబాటు చర్యలకు దిగాల్సింది పోయి, మళ్లీ అదే తప్పు పునరావృతం చేయడం పవన్‌కే చెల్లింది.
పవన్‌ను వైసీపీ నేతలు తరచూ ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తుంటారు. పవన్ మాట్లాడుతూ తనకు ఆర్థికంగా ఆఫర్ చేయడంపై నోరు తెరిచారు. ఇవాళ్టి మీటింగ్‌లో పవన్ ఏమన్నారో తెలుసుకుందాం.
ఈ పది సంవత్సరాలు రాజకీయంగా ఎలా నిలబడగలిగాను, ఎందుకు నిలబడగలిగానంటే… చాలా స్పష్టమైన అవగాహన వుందన్నారు. దేనికొచ్చాను, దేనికి నిలబడుతున్నాను? అని తానే ప్రశ్నించుకున్నారు. ఎక్కడా రాజీపడలేదని పవన్ చెప్పుకొచ్చారు. ఈ పదేళ్లలో తనను బెదిరించిన వాళ్లున్నారని ఆయన అన్నారు. అలాగే డబ్బులతో ప్రలోభ పెట్టిన వాళ్లున్నారని ఆయన అన్నారు. మీరొస్తే వందల కోట్లు ఇస్తామన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
అలా ఆఫర్ చేసిన వాళ్లెవరో తనకు తెలియకపోవచ్చన్నారు. మీకెందుకు సార్ పాలిటిక్స్, వ్యాపారాలు చేసుకోవాలని తనకు సూచించారన్నారు. తనను డబ్బులతో, పదవులతో కొనలేరని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అంటే తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. వైసీపీ విధానాలమీద చిరాకు వుందన్నారు.
పవన్‌కల్యాణ్ మాట్లాడితే తప్ప మహిళల మిస్సింగ్ కేసుల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడలేదు? ఏ మీడియా ఎందుకు కథనాలు రాయలేదు? డిబేట్లు పెట్టలేదు? అని పవన్ ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు.
కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే ఆగ్రహంగా మాట్లాడకుండా ఎలా వుంటారని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లు తన చిత్రపటాలను చెప్పులతో కొడుతున్నారని చెబుతున్నారన్నారు. వాలంటీర్లకు కోపం వచ్చిందని తెలుసన్నారు. తాను సరైన పాయింట్‌నే ఎత్తానని వారి రియాక్షన్ తెలియజేస్తోందని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. వేలాది మంది మహిళలు మిస్ అయ్యారని తాను విన్నది కరెక్టే అని సమర్థించుకున్నారు. ఇందుకు వాలంటీర్ల స్పందనే నిదర్శనమన్నారు.
వాలంటీర్ల పొట్ట కొట్టాలనేది తన ఉద్దేశం కాదన్నారు. వాలంటీర్లు డేటా ఎక్కడ పెడుతున్నారు? ఎవరికి పంపిస్తున్నారు? ఎక్కడ నిక్షిప్తమవుతోంది? ఆ సమాచారం వైసీపీ ఆఫీస్‌కు వెళుతోందా? జగన్ ఇంట్లో వుందా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.