రాజధానుల అంశంపై అత్యవసరంగా విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను డిసెంబర్‌కు వాయిదా వేయడం గమనార్హం. అభివృద్ధితో పాటు పరిపాలనను వికేంద్రీకరించాలన్న సదాశయంతో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టులో విచారణ జరుగుతుండగా, సాంకేతిక కారణాలను చూపి మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్నామని, తర్వాత విచారించాలని ప్రభుత్వం అభ్యర్థించింది.
అయితే ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వుంది. అంతేకాదు, ఆరు నెలల్లోనే రాజధానిని నిర్మించాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఆరునెలల్లో అమరావతిని నిర్మించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విశాఖకు పరిపాలన రాజధానిని తరలించాలని ఏపీ ప్రభుత్వం ఉత్సాహంగా వుంది. ఇవాళ ఈ కేసుపై జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు స్పందనపై ఏపీ సమాజం ఆసక్తి చూస్తోంది. విచారణను డిసెంబర్‌కు వాయిదా వేయడంతో ఏపీ ప్రభుత్వం నిరాశకు గురైంది.
నవంబర్ వరకూ రాజ్యాంగ ధర్మాసనం కేసులుండడంతో అంత వరకూ అమరావతిపై వెంటనే విచారణ చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఈ లోపు ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియను పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన విన్నపాన్ని సర్వోన్నత న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ ఏడాది డిసెంబర్‌కు విచారణను వాయిదా వేసింది.