టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నోటి దురుసు ఆయనకు రాజకీయంగా చిక్కులు తీసుకొస్తోంది. తాజాగా అమెరికాలో రైతులకు ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టైంది. రైతులకు రోజుకు మూడు గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటలూ అవసరం లేదని రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.
ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ బలం పెరుగుతోందన్న ప్రచారం బీఆర్ఎస్‌ను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను బద్నాం చేయడానికి ఎదురు చూస్తున్న బీఆర్ఎస్‌కు రేవంత్‌రెడ్డి వజ్రాయుధాన్ని ఇచ్చారు. తెలంగాణలో బోర్ల కింద వ్యవసాయం ఎక్కువ. రైతులకు కరెంట్ ఎంతో అవసరం. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ హామీ దోహదపడింది. రైతుల పక్షపాతిగా వైఎస్సార్‌ను జనం చూడగా, ప్రత్యర్థి చంద్రబాబును రైతుల వ్యతిరేకిగా చూశారు.
వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అన్నట్టుగా వైఎస్సార్‌తో పాటు నాడు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు చంద్రబాబుతో పోల్చి రేవంత్‌ను రైతు వ్యతిరేకిగా చూపేందుకు ప్రత్యర్థులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ వ్యాఖ్యలను మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. గతంలో వ్యవసాయాన్ని దండుగగా అభివర్ణించిన చంద్రబాబు వారసత్వాన్ని రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
ఉచిత విద్యుత్ అవసరం లేదనడం దుర్మార్గమన్నారు. గతంలో రోజుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ కట్టుబడి వుండాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ ఇంట్లో మాత్రం 24 గంటలూ కరెంట్ కావాలి, రైతులకు మాత్రం 3 గంటలు సరిపోతుందా? అని ఆయన నిలదీశారు.