ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబితే తప్పేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అమెరికాలో తానా సమావేశాల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదన్న మాట తెలంగాణలో రాజకీయ కలకలం రేపుతోంది. సొంత పార్టీ నుంచి కూడా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఏ సందర్భంలో అన్నారో తెలియదన్నారు.
దేశంలోనే తొలిసారిగా ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. ఉచిత విద్యుత్ అందించేందుకు నాడు సోనియాను వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పించారన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి లేరన్నారు. అప్పుడు వైఎస్సార్ ఎంత కష్టపడ్డాడో రేవంత్‌రెడ్డికి తెలియదన్నారు. ఉచిత విద్యుత్ వద్దన్న మాటలపై రేవంత్ వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి కోరారు. మ్యానిఫెస్టోలో ఇలా చేస్తామని చెప్పే అధికారం తనకు, రేవంత్‌రెడ్డికి లేదన్నారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఈ విషయాన్ని చెబుతున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటలూ ఉచిత విద్యుత్‌ను కోతల్లేకుండా నాణ్యమైనది సరఫరా చేస్తామన్నారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం అవుతారనడం తమాషానా అని ఆయన ప్రశ్నించారు. అమెరికా వెళ్లిన తర్వాత రేవంత్‌రెడ్డి ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. 65 సీట్లు ఎలా గెలవాలో ముందు చూసుకోవాలని రేవంత్‌కు ఆయన సూచించారు.