ఈ తరం వారు ఎక్కడ సవ్యంగా కాపురాలు చేస్తున్నారు.. అంటూ నిట్టూర్పులున్నా, భారతదేశంలో ప్రస్తుతం విడాకుల శాతం ఒకటిగా ఉంది. గతంలో ఇది కూడా ఉండేది కాకపోవడం వల్ల వందకు ఒక జంట విడిపోయినా కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. గతంలో అధికారికంగా విడాకులు ఉండేవి కావు, వదిలేయడం అంటూ ఒకటి ఉండేది, మగాడు రెండో పెళ్లి చేసుకున్నా ఆడది పడి ఉండే పరిస్థితులు ఉండేవి! అయితే కాలం మారింది. ఏదైనా అధికారికం అయ్యి 20 యేళ్లు అయిపోయాయి. దీని వల్ల దేశంలో విడాకుల శాతం పెరిగినట్టుగా కూడా అనిపించవచ్చు.
పాశ్చాత్య నాగరికతో విడాకులు అధికం అని, ఇండియాలో స్వల్పం అనేది ఇప్పటికీ వాస్తవమే. అయితే పాశ్చాత్య నాగరికతకు ప్రతినిధి లాంట అమెరికాలో కూడా విడాకుల శాతం 2.5 మాత్రమే అని అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో రెండున్నర శాతం విడాకులు, ఇండియాలో ఒక్క శాతం విడాకులు అంటే.. మనమేం మరీ అంత వెనుకబడి లేమని అనుకోవాలేమో! పెళ్లి విషయంలో భారతీయుల మనస్తత్వం మారుతున్న నేపథ్యంలో ఇండియాకూ, అమెరికాకు పెద్ద తేడా లేకుండా పోయే పరిస్థితికి సమయం మరెంతో దూరంలో లేనట్టుగా ఉంది!
అయితే.. ఇండియాలో ఇప్పుడు సింగిల్ గా ఉండిపోవడం కూడా అధికం అవుతూ ఉంది! వందకు రెండు మూడు శాతం మంది అసలు వివాహం జోలికే వెళ్లని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకించి అబ్బాయిల్లో ఈ శాతం పెరిగేలా ఉంది! వారి సంగతలా ఉంటే.. ఇండియాలో విడాకుల శాతాలు కాస్త పెరగడానికి కారణాల గురించి రిలేషన్ షిప్ కౌన్సెలర్లు రకరకాల విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు.
సామాజిక కట్టుబాట్లు మారడం!
గతంలో విడాకులు అంటే అదో పాపం అన్నట్టుగా, ప్రత్యేకించి స్త్రీ చేసుకున్న పాపం అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ ధోరణి పోయింది. విడాకుల్లో స్త్రీ బాధ్యత ఎంతో, మగవాడి బాధ్యత కూడా అంతే అనే పరిస్థితి వచ్చింది. గతంలో భర్త వదిలేస్తే అనది అధోగతి అనేది స్త్రీ భావన. అయితే ఇప్పుడు భార్యను వదిలేసిన మగాడినీ సమాజం ఏమీ హీరోలా చూడటం లేదు! ఇది స్త్రీ సాధికారతగా కూడా మారింది.
ప్రత్యేకించి గతంలో మగాడు ఎంత హింసించినా పడి ఉండాలనే ధోరణి సహజంగా ఉండేది. అయితే ఇప్పుడు స్త్రీలు అలాంటి మ్యారేజెస్ ను భరించే పరిస్థితుల్లో లేరు. తమ నిర్ణయాలను తాము తీసుకోగలుగుతున్నారు. కుటుంబాలు కూడా వారికి అండగా ఉంటున్నాయి. దీని వల్ల అధికారికంగా విడిపోయే పద్ధతిని ఉపయోగించుకోవడం పెరిగింది.
అర్బనైజేషన్, మోడర్నైజేషన్!
నగరీకరణ వల్ల వాళ్లేమనుకుంటారో, వీళ్లేమనుకుంటారో అనే పరిస్థితి పోయింది. ఇరుగుపొరుగుల గురించి ఆలోచించే పద్ధతే లేకుండా పోయింది. గతంలో ఇలాంటివి కూడా చాలా వరకూ మనుషులు రాజీ పడిపోయే పరిస్థితులను కల్పించేవి. ఇరుగు పొరుగు గురించి ఆలోచించాల్సిన అవసరం లేని తరం ఇప్పుడు వివాహ వ్యవస్థలోకి వచ్చింది. అలాగే మోడర్న్ లైఫ్ స్టైల్ కూడా మనుషులను మార్చేసింది. ఎవరికీ భయపడకపోయినా.. గతంలో ముడి పడిపోయింది కాబట్టి అనే ఆలోచించే వారు ఉండేవవారేమో! ఇలాంటి వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు.
ఎన్ని అసంతృప్తులు ఉన్నా ముడిపడిపోయింది కాబట్టి, పిల్లలున్నారు కాబట్టి.. అనే ధోరణితో కాపురాలు కొనసాగించే వాళ్లు కోకొల్లలు. అయితే ఇలాంటి వారిలో కూడా ఒకటీ అర శాతం లైఫ్ స్టైల్ ను ప్రయారిటీ గా తీసుకుంటున్నారు. ఇది కూడా ఇండియాలో విడాకుల శాతాన్ని కాస్త పెంచుతోంది.
ఎక్స్ పెక్టేషన్లు భారీగా ఉండటం!
మ్యారిటల్ లైఫ్ పై కొందరిలో ఎక్స్ పెక్టేషన్లు భారీ స్థాయిలో ఉంటాయి. పెళ్లి వేడుక ఎంత ఘనంగా వీరు డిజైన్ చేసుకుంటారో, పెళ్లి తర్వాతి జీవితాన్ని కూడా అదే స్థాయిలో ఊహించకుంటారు. అలాంటి ఎక్స్ పెక్టేషన్లకు తగ్గట్టుగా లైఫ్ లేకపోవడంతో వీరు తీవ్ర నిస్పృహకు లోనయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా పరస్పరం పడకపోవడం, ఎక్స్ పెక్టేషన్లను అందుకోకపోవడం వల్ల విడిపోయేవారి శాతం కూడా ఉంది. ప్రత్యేకించి హై క్లాస్, సెలబ్రిటీల విడాలకుల రీజన్లు ఈ కేటగిరిలోకే వస్తాయంటారు!
ఇంకా న్యాయ సేవలు విస్తృతంగా అందుతూ ఉండటం, ఉమ్మడి కుటుంబాల ఊసు లేకపోవడం వంటివి కూడా ఇండియాలో విడాకుల శాతం పెరుగుతూ ఉండటానికి కారణాల్లో ఉంటాయని రిలేషన్ షిప్ కౌన్సెలర్లు చెబుతున్నారు.