రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఘనంగా నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటం వద్ద షర్మిల అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామోజీరావు సేవల్ని ఆమె కొనియాడారు. అనంతరం రామోజీరావు భార్య రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి తదితర కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.
రామోజీకి, వైఎస్సార్ కుటుంబానికి ఉప్పునిప్పులా వ్యవహారం నడిచింది. వైఎస్సార్ మరణించినా, ఆయన కుమారుడైన వైఎస్ జగన్‌తో రామోజీరావు శత్రుత్వాన్ని కొనసాగించారు. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా రామోజీరావు మీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తూ వుంటుంది. జగన్‌కు వ్యతిరేకంగా వార్తా కథనాల్ని రాయడం సామాజిక బాధ్యతగా రామోజీరావు మీడియా భావిస్తున్నట్టుంది.
గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను… ఆ రెండు పత్రికలంటూ వైఎస్సార్ విమర్శించేవారు. చంద్రబాబు రాజగురువుగా రామోజీరావును సమాజం గుర్తించింది. అందుకే రామోజీ మీడియాను టీడీపీ తమ ఫ్యామిలీగా గుర్తించింది. ఎల్లో మీడియాగా అందరూ పిలిచే సంగతి తెలిసిందే.
రామోజీరావు మరణంపై వైఎస్ జగన్ సంతాప ప్రకటన వెలువరించారు. వైసీపీ తరపున రామోజీకి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. తాజాగా షర్మిల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి నివాళులర్పించడం అందుకే ప్రత్యేకత సంతరించుకుంది.