కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ చూడని రాజకీయ పరిణామాలు చూస్తున్నాం. ముఖ్యంగా టీడీపీ నాయకులు మాటల తూటాలు పేల్చుతున్నారు. గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోడానికి కొంత మంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు మున్సిపల్ అధికారులపై నోరు పారేసుకున్నారు. రాయడానికి కూడా వీల్లేని అభ్యంతరకర బూతులతో విరుచుకుపడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సీనియర్ ఎమ్మెల్యే అయిన అయ్యన్నకు స్పీకర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్‌గా అయ్యన్ననే ఎందుకు ఎంపిక చేశారో, మంగళవారం ఆయన సంస్కార వంతమైన భాష చూసిన తర్వాత జనానికి అర్థమైంది.
అంతకు ముందు మంత్రి అచ్చెన్నాయుడు పచ్చ బిళ్లల గురించి మాట్లాడ్డం కూడా చర్చనీయాంశమైంది. బహుశా వారి స్ఫూర్తితో తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనదైన శైలిలో రవాణాశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేయ్, నా కొడకల్లారా నరుకుతా అంటే యథేచ్ఛగా మీడియా సమావేశంలో దూషణ పర్వానికి దిగారు. అయ్యన్నపాత్రుడి కామెంట్స్ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి మరికాస్త ముందుకెళ్లి నరుతానని, బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు తన కాళ్లు పట్టుకోవాలని నోరు పారేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయ్యన్నకు స్పీకర్ పదవి ఇస్తున్నారని, జేసీకి హోంశాఖ ఇవ్వాలనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి అయితే శాంతిభద్రతల్ని చక్కగా కాపాడుతారనే వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.
జేసీ ప్రభాకర్‌రెడ్డికి హోంశాఖ ఇచ్చి, ఎమ్మెల్సీ చేస్తే సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే కూటమి నేతలు ముందుకు సాగాలని వైసీపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. మొన్న అచ్చెన్న, నిన్న అయ్యన్న, నేడు ప్రభాకరన్న.. మరి రేపు ఎవరో అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.