జగన్ ముద్ర పథకాలకు ఏ పేర్లు పెడతారో?

కొత్త ప్రభుత్వం గద్దె మీదికి వచ్చిన వెంటనే పథకాలకు పేర్లు మార్చు ప్రక్రియ షురూ అయింది. రాష్ట్రంలో ఏ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పటికీ.. పాత ప్రభుత్వం అమలుచేసిన పథకాలు అన్నింటికీ పేర్లు మార్చి…

కొత్త ప్రభుత్వం గద్దె మీదికి వచ్చిన వెంటనే పథకాలకు పేర్లు మార్చు ప్రక్రియ షురూ అయింది. రాష్ట్రంలో ఏ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పటికీ.. పాత ప్రభుత్వం అమలుచేసిన పథకాలు అన్నింటికీ పేర్లు మార్చి తమ సొంత పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీనే. అదే క్రమంలో.. చంద్రబాబునాయుడు సర్కారు.. తాజాగా ఆరు పథకాలకు పాతపేర్లనే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ పేరును, వైఎస్సార్ పేరును సహజంగానే తొలగించారు. 2019కి పూర్వం నుంచి అమలవుతున్న పథకాలకు ఇలా పేర్లు మార్చినట్టుగా తెదేపా నాయకులు చెబుతున్నారు. అయితే.. 2019 తర్వాత.. జగన్ తన సొంత ఆలోచనలోంచి తీసుకువచ్చిన కొత్త పథకాల పేర్ల సంగతి ఏం చేస్తారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో మొత్తం ఆరు పథకాలకు పేర్లు మార్చింది. జగనన్న విద్యాదీవెన- పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, జగనన్న వసతి దీవెన- పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, జగనన్న విదేశీ విద్యా దీవెన (ఎస్సీలకు)- అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, వైఎస్సార్ కల్యాణమస్తు- చంద్రన్న పెళ్లికానుక, వైఎస్సార్ విద్యోన్నతి- ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం- ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. అని పేర్లు మార్చారు.

మొత్తం ఆరుపథకాలకు పేర్లు మార్చగా.. వాటిలో నాలుగింటికి జగనన్న, రెండింటి వైఎస్సార్ అనే పేర్లు ముందుగా జోడించి ఉండేవి. అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం పెళ్లి కానుకకు మాత్రం చంద్రన్న పేరును, విద్యోన్నతికి ఎన్టీఆర్ పేరును జోడించింది. మిగిలిన నాలుగు పథకాలకు తెలుగుదేశం ముద్రలేని పేర్లనే పెట్టారు.

ఇంతవరకు బాగానే ఉంది. 2019 ముందు కూడా అమలవుతున్నవనే మిషమీద ఈ పేర్లన్నీ మార్చారు. మరి పూర్తిగా జగన్ ముద్రగల సంక్షేమ పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. అమ్మఒడి వంటివి ఈ కోవకే చెందుతాయి. వీటి విషయంలో చంద్రబాబునాయుడు ఏం చేస్తారు. ఆ పథకాలు జగన్ తన సొంత ఆలోచన నుంచి అమలు చేసినవి. జగన్ బొమ్మతో ముద్రించిన స్కూలు బ్యాగులను విద్యార్థులకు పంపిణీ చేయడానికి ఓకే చెప్పినట్టుగానే.. చంద్రబాబు అలాంటి పథకాల విషయంలో కూడా ఎలాంటి మార్పు చేయకుండా తన ఔన్నత్యం చూపించుకుంటారా? అనేది వేచిచూడాలి.