ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ లీడర్ ఎవరు అంటే ఠక్కున చెప్పే ఒకే ఒక్క పేరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అని. ఆయన 1983లో పాతికేళ్ళ వయసులో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో మొదటిసారి మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ఆయనకు తన కేబినెట్ లో చోటు ఇచ్చారు. అలా 2024 ఎన్నికల దాకా చూస్తే నర్శీపట్నం నుంచి పది సార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలిచిన నాయకుడిగా అయ్యన్న ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఆ మాదిరిగా పోటీ చేసి గెలిచిన వారు లేరు. అది ఆయనకు ఉన్న రికార్డు.
ఆరు సార్లు కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. నలభై రెండేళ్ల రాజకీయ అనుభవం. చంద్రబాబు కంటే టీడీపీలో తానే సీనియర్ అని చెప్పుకునే అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండ్. ఏడు పదులకు చేరువలో ఉన్నా ఆయనలో ఫైర్ అలాగే ఉంది.
అయితే ఆయన ఒక్కోసారి మాట్లాడే భాష మాత్రం వినడానికే ఇబ్బందిగా ఉంటుంది. అలవోకగా బూతులు దొర్లుతాయి. మంగళవారం అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం లో రోడ్ల నాణ్యత మీద ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడుతూ బూతులతో రెచ్చిపోయారు. వినలేని రాయలేని భాషలో ఆయన అధికారుల మీద బూతు పురాణంతో విరుచుకుపడ్డారు.
రోడ్ల నాణ్యత బాగు లేదు అన్నది ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆవేదన అర్ధం చేసుకోవాల్సిందే. అధికారులకు క్లాస్ తీసుకోవాల్సిందే. కానీ ఈ క్రమంలో అదుపు తప్పి బూతులు మాట్లాడటం అది కూడా రోడ్డు మీదనే అలా చేయడంతో అంతా షాక్ అయ్యారు. పక్కన మహిళా సిబ్బంది ఉన్నారని కూడా చూడకుండా అయ్యన్న ఈ విధంగా భాష వాడడంతో అధికారులకు ఏడుపు ఒక్కటే తక్కువ అయింది.
కొత్త శాసనసభ కొలువు తీరుతున్న వేళ స్పీకర్ గా అయ్యన్న పేరు వినిపిస్తోంది. ఆయనకే ఈ పదవి అని చంద్రబాబు ఖరారు చేశారు అని అంటున్న సందర్భంలో అయ్యన్న ఇదే తీరున వ్యవహరిస్తే ఇబ్బందే అని అంటున్నారు. స్పీకర్ అంటే రాజ్యాంగ బద్ధమైన పదవి. అయ్యన్న ఇక మీదట అయినా తన భాషను ఎలా అదుపు పొదుపుగా వాడతారో చూడాలి.