టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చి రుషికొండ మీద వైసీపీ ప్రభుత్వం కట్టిన భవనాలను తానే తీసి తొలిగా అడుగు పెట్టాలని భావించారుట. మీడియాను వెంటబెట్టుకుని అణువణువూ అక్కడ చూపిస్తూ జగన్ మీద ఒక స్థాయిలో విమర్శలు చేయడానికి ఏపీ ప్రజలకు రుషికొండలో వైసీపీ చేసిన నిర్వాకం కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికి అంతా సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.
రుషికొండ కట్టడాల మీద టీడీపీ మూడేళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తోంది. చంద్రబాబు విశాఖ టూర్ లో అనేకసార్లు రుషికొండ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆయన రుషికొండ మీద ఏమి కడుతున్నారు అన్నది చూడాలని ప్రయత్నించిన పరిస్థితి కూడా ఉంది.
అధికారులు అడ్డుకున్నారు అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు మొత్తం జాతీయ స్థాయిలోనే వైసీపీ సర్కార్ చేసిన దుబారా అలాగే పర్యావరణానికి చేటు తెచ్చేలా ఎలా ప్రకృతికి ఆలవాలం అయిన కొండ మీద కట్టడాలు కట్టారో చూపించాలనుకున్నారుట.
ఇంతలో భీమిలీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అతి ఉత్సాహంతో రుషికొండ మీద అడుగు పెట్టారు. ఆయన అక్కడ గదులన్నీ తిరిగి ఫోటోలు మీడియా ద్వారా బయటకు వదిలారు. ఆ విధంగా గంటా హైలెట్ అయ్యారు. కానీ టీడీపీ రుషికొండ ఎపిసోడ్ నుంచి ఎంతో పొలిటికల్ మైలేజ్ ని ఆశించింది కానీ దానికి గంటా ఇలా గండి కొట్టారని పార్టీలో చర్చ సాగుతోందని అంటున్నారు.
గంటా అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్నా రుషికొండ వివాదం విషయంలో ఏనాడూ పెదవి విప్పలేదని ఇపుడు మాత్రం ఆర్భాటంగా అక్కడకి వెళ్ళి తాను హైలెట్ కావాలని అనుకున్నారని తమ్ముళ్ళు గుసగుసలు పోతున్నారుట. గంటా రుషికొండ ఫోటోలు బయటపెట్టిన వెంటనే మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. అవి కాదు ఇంకా అసలైనది రుషికొండ భవనాల్లో ఉంది. ఆ సీక్రెట్స్ అన్నీ బయటపెడతామని అన్నారు.
అంటే టీడీపీ హై కమాండ్ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ రుషికొండ విషయంలో ఒక వ్యూహం ప్రకారమే వెళ్తున్నారు అని అంటున్నారు. చంద్రబాబు విశాఖ పర్యటన తొందరలో ఉంది. చంద్రబాబు స్వయంగా విజిట్ చేసి ఈ కట్టడాల మీద ప్రభుత్వ విధానాన్ని తెలియచేస్తారని అంటున్నారు. అలాగే జగన్ ప్రజా ధనం దుబారా చేశారు అన్నది మరింతగా హైలెట్ చేస్తారు అని అంటున్నారు.