దిల్ రాజు గుండెలపై గేమ్ ఛేంజర్ భారం

నిర్మాత దిల్ రాజు అనుకుని వుండరు. గేమ్ ఛేంజర్ సినిమా తన ప్రొడక్షన్ గేమ్ నే మారుస్తుందని. శంకర్ తో ఇండియన్ 2 సినిమా అనుకుని, దాన్ని తనే వదిలేసుకుని, మళ్లీ తనే శంకర్…

నిర్మాత దిల్ రాజు అనుకుని వుండరు. గేమ్ ఛేంజర్ సినిమా తన ప్రొడక్షన్ గేమ్ నే మారుస్తుందని. శంకర్ తో ఇండియన్ 2 సినిమా అనుకుని, దాన్ని తనే వదిలేసుకుని, మళ్లీ తనే శంకర్ తో సినిమాకు చిక్కుకోవడం అంటే ఏమనాలి? టైమ్.. అంతే. నిజానికి గేమ్ ఛేంజర్ సినిమా స్టార్ట్ చేసే నాటి పరిస్థితులు వేరు. అంతా పాజిటివ్ గా వుంది. ఎవ్విరిథింగ్ ప్లాన్డ్ గా వుంది. ఫండింగ్ ప్రోబ్లెమ్ లేదు. జీటీవీతో ఒప్పందం వుంది. అంతా బాగుంది. అలా ముందుకు వెళ్తోంది అనుకుంటే, కమల్ హాసన్ తన విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి.

అంతే, ఇండియన్ 2 సినిమా మళ్లీ తెరమీదకు వచ్చింది. లైకా సంస్థకు రెడ్ జయింట్ ఉదయానిధి స్టాలిన్ తోడయ్యారు. దాంతో శంకర్ కు అన్ని వైపుల నుంచి వత్తిడి, లీగల్ కమిట్ మెంట్ లు తప్పలేదు. సో, ఓ పక్క ఇండియన్ 2 చేస్తూనే గేమ్ ఛేంజర్ చేయాల్సి వచ్చింది. శంకర్ లాంటి దర్శకుడు ఏడాది నుంచి రెండేళ్లు తమ దృష్టి మొత్తం పెడితే ఓ సినిమా చేస్తారు. అలాంటిది ఒకేసారి రెండు సినిమాలు చేయాల్సి రావడం అంటే మామూలు విషయం కాదు. దానికి తోడు రకరకాల కారణాల వల్ల షూటింగ్ లు క్యాన్సిల్ కావడం, నిర్మాణ వ్యయం అంతకు అంతకూ పెరుగుతూ రావడం జరిగిపోయింది.

ఇలాంటి టైమ్ లో ఎక్కడ లేని పెట్టుబడులు అదే సినిమాకు తరలించాల్సి వచ్చింది. పైగా మన దర్శకులు అంటే దిల్ రాజు కూర్చుని, డిస్కషన్లు వగైరా వుండేవి. శంకర్ శైలి వేరు. దిల్ రాజు మాట నడిచే పరిస్థితి లేదు. దాంతో అలా సాగుతోంది. ఇప్పటికి హీరో రామ్ చరణ్ షూట్ పూర్తయింది. మిగిలిన వారి పోర్షన్ మరో ఇరవై రోజులు వుంది. దాంతో సినిమా పూర్తయిపోతుంది.

ఈ సినిమా అయితే తప్ప దిల్ రాజు టెన్షన్ నుండి బయటకు వచ్చి, లాభాలు, నష్టాలు లెక్కలు కట్టుకుని, తన ఫ్యూచర్ ప్రోజెక్ట్ ల మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. అనిల్ రావిపూడి ఇంకా మరో ఇద్దరు ముగ్గురు దర్శకుల సినిమాలు పట్టాలెక్కించాల్సి వుంది. ప్రస్తుతం చేస్తున్న తమ్ముడు సినిమా విడుదల చేయాల్సి వుంది. కొత్త ప్లాన్ లు అమలు చేయాల్సి వుంది.

అన్నింటికీ ఒకటే సమస్య. గేమ్ ఛేంజర్ పూర్తి కావాలి. విడుదల కావాలి. ఆ లెక్కలు తేలాలి. దిల్ రాజు ఊపిరి పీల్చుకుని, ఫ్రెష్ గా దిల్ రాజు 2.0 అన్నట్లు మళ్లీ ట్రాక్ లోకి రావాలి.