ఈవీఎం వ‌ద్దు.. బ్యాలెట్ ముద్దుః జ‌గ‌న్‌

ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణం. అయితే దారుణ ఓట‌మి ఎదురైన‌ప్పుడు స‌హ‌జంగానే దాన్ని జీర్ణించుకోలేరు. ఆ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల అనుమానాలు క‌లుగుతాయి. ఇది స‌హ‌జం. అయితే అనుమానాల‌కు బ‌లం క‌లిగించేలా దేశ రాజ‌కీయాల్లో కొన్ని ప‌రిణామాలు…

ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణం. అయితే దారుణ ఓట‌మి ఎదురైన‌ప్పుడు స‌హ‌జంగానే దాన్ని జీర్ణించుకోలేరు. ఆ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల అనుమానాలు క‌లుగుతాయి. ఇది స‌హ‌జం. అయితే అనుమానాల‌కు బ‌లం క‌లిగించేలా దేశ రాజ‌కీయాల్లో కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. వ‌రుస‌గా ఎన్డీఏ అధికారంలోకి రావ‌డంపై విప‌క్షాలు అనుమానిస్తున్నాయి. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్‌, హ్యాకింగ్ చేయ‌డం వ‌ల్లే మోదీ స‌ర్కార్ ప్ర‌తి ఎన్నిక‌లోనూ విజ‌యం సాధిస్తోంద‌ని ఇండియా కూట‌మి నేత‌లు సందేహిస్తున్నారు.

ఇందుకు త‌గ్గ‌ట్టుగా ముంబ‌య్‌లో ఈవీఎం అన్‌ల్యాకింగ్‌, అలాగే 144 నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌మోదైన ఓట్ల‌కు, లెక్కించిన ఓట్ల‌కు వ్య‌త్యాసం వుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈవీఎంల ద్వారా ఎన్డీఏ ఏదో చేసుకుంద‌నే అనుమానాల‌కు బ‌లం క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న ఘోర ప‌రాజ‌యంపై కొన్ని అనుమానాలున్నాయ‌ని, అయితే వాటికి ఆధారాలు లేక‌పోవ‌డంతో తానేమీ మాట్లాడ‌లేక‌పోతున్న‌ట్టు వైఎస్ జ‌గ‌న్ ఈ నెల 4న కీల‌క కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల క్రితం ఈవీఎంల‌లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని, త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు అందుకే ఆ స్థాయి విజ‌యం ద‌క్కింద‌ని వైఎస్ జ‌గ‌న్ న‌ర్మ‌గ‌ర్భ కామెంట్స్ చేశారు.

తాజాగా జ‌గ‌న్ మ‌రోసారి ఈవీఎంల తేనెతుట్టెను క‌దిల్చారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. అదేంటంటే… “న్యాయం జ‌ర‌గ‌డం ఒక్క‌టే ముఖ్యం కాదు. జ‌రిగిన‌ట్టు క‌నిపించాలి కూడా. అలాగే ప్ర‌జాస్వామ్యం గెల‌వ‌డంతో పాటు నిస్సందేహంగా గెలిచిన‌ట్టు క‌నిపించాలి కూడా. ప్ర‌పంచ  వ్యాప్తంగా అత్య‌ధిక దేశాల్లో ఎన్నిక‌ల కోసం బ్యాలెట్లు ఉప‌యోగిస్తున్నారు. ఈవీఎంలు కాదు. ప్ర‌జాస్వామ్యం అస‌లైన స్ఫూర్తిని కొన‌సాగించేందుకు మ‌న దేశంలో కూడా ఆ దిశ‌గా ముందుకు క‌ద‌లాలి” అని ఎక్స్‌లో పోస్టు పెట్టారాయ‌న‌.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి రెండు వారాల‌వుతున‌నా, ఈవీఎంల‌పై ప్ర‌కంప‌న‌లు మాత్రం కొన‌సాగుతున్నాయి. ఏపీ విష‌యానికి వ‌స్తే, వైసీపీ ఘోరంగా ఓడిపోవ‌డానికి ఈవీఎంల ట్యాంప‌రింగ్ కార‌ణ‌మ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. వైసీపీ శ్రేణులు కూడా ఆ ర‌కంగా స‌ర్ది చెప్పుకుని కొద్దోగొప్పో ఊర‌ట చెందుతున్నాయి. మ‌రోవైపు జ‌గ‌న్ ట్వీట్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.