ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గమైన పులివెందులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఈ నెల 19న తాడేపల్లి నుంచి ఆయన పులివెందులకు వెళ్లనున్నట్టు జగన్ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రెండురోజులు ఆయన పులివెందులలో ఉంటారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు.
ముఖ్యమంత్రిగా సొంత నియోజకవర్గ కార్యకర్తలతో పాటు రాయలసీమ నాయకులకు జగన్ దర్శనభాగ్యం కరువైంది. ముఖ్యంగా పులివెందుల వైసీపీ శ్రేణులు తమకు జగన్‌ను కలిసే అవకాశం లేదని ఆగ్రహంగా ఉన్నాయి. ఏదైనా పని వుంటే ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని మాత్రమే కలవాల్సి వుంటుంది. అవినాష్‌రెడ్డిని కలవడం అంత సులువు కాదని గత ఐదేళ్ల అనుభవం చెప్పింది.
వైఎస్సార్ జిల్లాలో వైసీపీకి ఒక పెద్ద దిక్కు అవసరం వుంది. అవినాష్‌రెడ్డిపై జగన్ నమ్మకం వుంచినా, దాన్ని నిలుపుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారనే అభిప్రాయం వుంది. అవినాష్‌రెడ్డి వ్యక్తిగతంగా మంచివాడైనప్పటికీ, సమస్యల పరిష్కారంలో సమర్థత చాటుకోలేకపోయారని చెబుతారు. ఈ నేపథ్యంలో పులివెందులలో జగన్ రెండు రోజుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి ఆయన బయల్దేరుతారు.