జగన్ తన మనసులో మాటను బయటపెట్టడానికి రెండు వారాలు పట్టింది. ఇన్నాళ్లూ ప్రతిసారీ కాస్త నర్మగర్భాలంకారం వేసి ఆయన అనుమానాలు బయటపెడుతూ ఉన్నప్పటికీ.. తాజాగా ఈవీఎంల మీద స్పష్టంగా వ్యతిరేకతను బయటపెట్టారు.
ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తి కొనసాగాలంటే.. పేపర్ బ్యాలెట్ల దిశగా మన దేశంలో కూడా అడుగులు పడాలని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘ఏదో జరిగింది’ అనే మాటతో ఈవీఎంల మీద అనుమానాలను ఇన్నాళ్లూ వ్యక్తంచేసిన ఆయన, ఇన్నాళ్ల తర్వాత స్పష్టంగా విమర్శలు చేయడం విశేషం.
జగన్మోహన్ రెడ్డి తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్టు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదేదిశగా ముందుకు కదలాలిై’ అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.
జగన్ ఎన్నికల ఫలితాలు వెలవడిన రోజు సాయంత్రం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మరురోజు కూడా మీడియాతో మాట్లాడారు. ‘ఏదో జరిగింది. ఏం జరిగిందో దేవుడికి తెలుసు’ అంటూ ఆయన పరోక్షంగా పోలింగులో అక్రమాలు జరిగాయనే అనుమానాలను బయటపెట్టారు. ఆ అనుమానం మొత్తం ఈవీఎంల మీదనే అని ఇవాళ తేల్చేశారు.
జగన్ ఇలాంటి అనుమానం వెలిబుచ్చడం పట్ల ప్రత్యర్థులు కూడా విరుచుకుపడే అవకాశం ఉంది. 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల మీద తెలుగుదేశం వారు ఇదే తరహా ఆరోపణలు చేశారు. జగన్ కు అప్పుడు పేపర్ బ్యాలెట్ కావాలని అనిపించలేదా? అనేది సర్వసాధారణమైన విమర్శ! అదే సమయంలో ఈవీఎంలలో మాయ అనేది చంద్రబాబునాయుడు మాత్రమే చేశారని జగన్ అనుమానిస్తున్నారా? అనేది ఇంకో ప్రశ్న.
కేంద్రంలో భాజపాతో కలవడం అనేది ఎన్నికల్లో మాయ చేయడానికే అని తెలుగుదేశం మీద ఆరోపణలు చేశారు జగన్! ఈవీఎంలలో మాయ అనేది భాజపా సహకారంతో చేసిన వ్యవహారం అని ఆయన అనుకుంటే.. భాజపా చంద్రబాబు కోసం మాత్రం ఎందుకు చేస్తుంది. కేంద్రంలో తమ పార్టీ గడ్డు స్థితిలో పడే వాతావరణాన్ని ఎందుకు తప్పించుకోలేకపోయింది.. అనే ప్రశ్నలు కూడా వస్తుంటాయి.
జగన్ ఇప్పటికైనా స్పష్టంగా ఆరోపించడం మంచిదే. ఈవీఎంలు తీసేసి పేపర్ బ్యాలెట్లు పెడతారా? లేదా? తర్వాతి సంగతి.. కనీసం ఈ విషయంపై చర్చ జరగాలి.