కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకోడానికి మంత్రి అచ్చెన్నాయుడు ఆవేశంలో నోరు జారారు. అధికారం అనేది చేయకూడని తప్పులన్నీ చేయిస్తుంది. ఇక విచ్చలివిడితనం, అరాచకానికి అమాత్యులే పచ్చ జెండా ఊపితే.. ఇక చెప్పేదేముంది? మంత్రి అచ్చెన్నాయుడి మాటల్ని స్వార్థ రాజకీయ నాయకులు అవకాశంగా తీసుకోడానికి మార్గం సుగుమమైంది.
ఐదేళ్ల పాటు అవమానాలు ఎదుర్కొన్నారని, ఇక వాటికి ఫుల్‌స్టాప్ పెట్టడంతో పాటు ఎనలేని గౌరవం దక్కేలా చూసుకుంటానని అచ్చెన్నాయుడు బహిరంగంగా ప్రకటించారు. ఎస్ఐ, ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీస్‌కు పచ్చబిళ్ల వేసుకుని వెళితే, కుర్చీ వేసి, కాఫీ ఇచ్చి ఎంతో మర్యాద ఇచ్చి, పనులు చేసేలా తాను ఆదేశాలు ఇస్తానని అచ్చెన్నాయుడు చాలా గట్టిగా చెప్పారు. అంతేకాదు, ఒకరిద్దరు తన మాటను జవదాటితే ఏమవుతుందో చెప్పాల్సిన పనిలేదని కూడా ఆయన హెచ్చరించారు.
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా అధికారులకు ఆదేశాలు ఇస్తానని అచ్చెన్నాయుడు చెప్పడాన్ని తప్పు పట్టలేం. కానీ పచ్చబిళ్ల వేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే, అతిథి మర్యాదలు, పనులు చేసి తీరాలన్న షరతులను సాకుగా తీసుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోవడం ఖాయం. రాజకీయాల్లో దళారులు అధికార పార్టీ నేతల అవతారం ఎత్తడం కొత్తేమీ కాదు.
అలాంటి వాళ్లంతా ఇకపై ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ కార్యాలయాలకు వెళ్లి …చేయకూడని పనులన్నీ చేయించడం ఖాయం. అధికారంలో ఉన్నప్పుడు, కళ్లు కనిపించకుండా ప్రవర్తిస్తుంటారని అచ్చెన్నలాంటి వాళ్లకు తెలియదని అనుకోలేం. పచ్చబిళ్ల వెసుకెళ్లి, రెవెన్యూ, పోలీస్ అధికారుల మెడపై కత్తి పెట్టి, చేస్తారా? చస్తారా? అని తప్పక బెదిరిస్తారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయలేమని అధికారులు చెబితే, వారిపై వైసీపీ ముద్రో, మరొకటో వేసి, బదిలీ వేటు వేసే అవకాశం వుంటుంది.
అచ్చెన్నాయుడు అలవోకగా అన్న మాటలు, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రమాదం వుంది. ప్రభుత్వ కార్యాలయాలను అధికార పార్టీ నేతలకు అడ్డాగా మారిస్తే, తమకు గిట్టని వారి ఆస్తులను మార్చివేయడం, అలాగే ఇష్టానుసారం కేసులు నమోదు చేయించి, వేధింపులకు పాల్పడేలా చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్యకర్తలను పట్టించుకుంటూ, వారి పనులు అయ్యేలా చూసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఆ పేరుతో రానున్న రోజుల్లో అరాచకానికి తెరలేస్తే మాత్రం.. ఏం జరుగుతుందో కాలమే అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది.