జాతీయ ప్రాజెక్టు పోలవరం చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును , కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఎవరు తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వ్యక్తిగత ఆదాయాన్ని నాటి, నేటి పాలకులు చూసుకున్నారనేది జగమెరిగిన సత్యం. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం… పదేళ్లు అవుతున్నా, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తి చేయలేదు.
తగదునమ్మా అంటూ .. ప్రతి సోమవారం పోలవరం అంటూ చంద్రబాబునాయుడు మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ తన కష్టాన్ని జగన్ వృథా చేశారంటూ విమర్శలు చేశారు. పోలవరం ద్రోహి జగన్ అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం నిర్మాణానికి ఇంకా నాలుగేళ్ల సమయం పడుతుందని బాబు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జలవనరులశాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబే పోలవరం నిజమైన ద్రోహి అని విరుచుకుపడ్డారు. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు సర్కార్ చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. నేడు జగన్‌పై బుదర చల్లడానికి ఎల్లో బ్యాచ్ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.
వైఎస్ జగన్ హయాంలో పోలవరంలో శరవేగంగా పనులు జరిగాయన్నారు. తమ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. పోలవరం నిర్మిస్తామని చంద్రబాబు కేంద్రం నుంచి తీసుకోవడం చారిత్రిక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. పోలవరాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు డబ్బు సంపాదించాలని చూశారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పిదాలను గుర్తించాలని కోరారు.