బహుళార్ధ సాధక ప్రెస్ మీట్

పోలవరం ప్రాజెక్ట్..బహుళార్ధక సాధక ప్రాజెక్ట్. అది అందరికీ తెలిసిందే. రకరకాల ప్రయోజనాలు వున్న ప్రాజెక్ట్ ను బహుళార్ధసాధక ప్రాజెక్ట్ అంటారు. అది కూడా తెలిసిందే. కానీ నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం…

పోలవరం ప్రాజెక్ట్..బహుళార్ధక సాధక ప్రాజెక్ట్. అది అందరికీ తెలిసిందే. రకరకాల ప్రయోజనాలు వున్న ప్రాజెక్ట్ ను బహుళార్ధసాధక ప్రాజెక్ట్ అంటారు. అది కూడా తెలిసిందే. కానీ నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన పోలవరం ప్రాజెక్ట్ పర్యటనను కూడా బహుళార్ధకంగా మార్చుకున్నారు. అవీ తెలివితేటలు అంటే. అదీ రాజకీయం అంటే. అదీ అనుభవం అంటే. ప్రెస్ మీట్ లో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట వెనుక ఓ అర్థం పరమార్ధం వుండడం కాదు..బహుళార్ధసాధకం గా వుంది ప్రసంగం అంతా

అన్నింటి కన్నా మొదటిటి ప్రాజెక్ట్ సందర్శన. ఓ ముఖ్యమంత్రిగా తాను ఎంత క్రియాశీలకంగా వుంటారో తెలియచెప్పే ప్రయత్నం అధికారంలోకి రాగానే, ఇబ్బడి ముబ్బడిగా పనులున్నా కూడా పోలవరం రావడం అన్నది. ఎలా అయితే జనం శహభాష్ అంటారో రాజకీయ నాయకులకు తెలియాలి. లేదంటే వృధా. చంద్రబాబుకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే అధికారంలోకి రాగానే పోలవరం వెళ్లారు.ఏ కారణంగా వెళ్లినా అది మంచి పని. పోలవరం ప్రాజెక్ట్ మీద ప్రభుత్వానికి వున్న శ్రద్ధను తెలియచేస్తుంది. ఇలా రెండు విధాలుగా ఈ పర్యటన ఉపయోగపడుతుంది.

ఇక ప్రెస్ మీట్ విషయానికి వస్తే…జగన్ అనే వ్యక్తి అసలు రాజకీయాలకు పనికి రాడు. అస్సలు క్షమించకూడదు. శిక్షించాలి. ఎలా శిక్షించాలి..ఇలాంటివి అన్నీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఒడిన జగన్ ను మరింక అస్సలు లేవకుండా చేసే ఆలోచనకు అంకురార్పణ ఇది. మరో అయిదేళ్ల తరువాత జగన్ లేస్తే…అందుకు ఇప్పటి నుంచే జనం దృష్టిలో జగన్ ను పనికిరానివాడిగా ముద్ర వేసి, కంటిన్యూ చేయాలనే ఆలోచన ఇది.

ఇంతకీ జగన్ చేసిన తప్పు ఏమిటి? పోలవరం విషయంలో. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తరువాత చేయాల్సిన పనులు చేయలేదట. అందువల్లే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందట. అంతే తప్ప అంతకు ముందు దాని నిర్మాణం టైమ్ లో వున్న కాంట్రాక్టర్ కానీ, అధికారులు కూడా ప్రభుత్వం కానీ దానికి బాధ్యులు కారు అని చెప్పే ప్రయత్నం అది.

అప్పుడు ఆ వాల్ కట్టినందుకు అయిన ఖర్చుకు రెట్టింపు అవుతుందట రిపేర్ కు. ఏ నిపుణులు చెప్పకుండానే చంద్రబాబు అంచనా వేసారు. అంటే భవిష్యత్ లో ఆ వాల్ రిపేర్లకు ఏ మేరకు టెండర్లు లెక్క కట్టబోతున్నారో సూచాయిగా చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ వేదిక అయింది. అదో ప్రయోజనం దీంతో. అంతే కాదు, పోలవరం అంచనాలు అన్నీ పెరిగిపోయాయి. ఎంత అవుతుందో అసలు అంచనాకే అందడం లేదన్నారు. ఆ విధంగా పోలవరం కొత్త డిపిఆర్ ఎలా వుండబోతోందో, ఎలా వుండాల్సి వుందో ఇండైరెక్ట్ గా చెప్పారు.

దటీజ్ చంద్రబాబు. ఆయన ఓ మాట అన్నా, ఓ పని చేసినా, దాని వెనుక అర్ధం, పరమార్ధం అన్నీ వేరుగా వుంటాయి. బహుళార్ధసాధకంగా వుంటాయి. ఈ ప్రెస్ మీట్, పోలవరం పర్యటన కూడా అంతే.