రాహుల్ గాంధీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. లోక్ సభలో ప్రమాణం చేసేలోగా ఒక స్థానాన్ని వదులుకోవాల్సిందే. ఒకటి ఉత్తరాది నుంచి, ఒకటి దక్షిణాది నుంచి ఆయన గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఏ సీటును వదలుకుంటారు? ఈ దేశానికి భావిప్రధాని కావాలని కోరుకుంటున్న వ్యక్తి యొక్క ప్రాధాన్యాలు ఎలా ఉంటాయి? అనేది కీలక చర్చగా మారే అంశమే. ఆయన దేనిని వదులుకుంటారనే దానిని బట్టి.. ప్రత్యర్థులు ఆయన మీద రాజకీయ అస్త్రాలు సంధిండానికి సిద్ధమవుతూ వచ్చారు కూడా.
అయితే రాహుల్ గాంధీ ప్రత్యర్థులకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా.. వ్యూహాత్మకంగా వయనాడ్ ను వదలుకున్నారు. ఆ స్థానం నుంచి జరిగే ఉప ఎన్నికలో ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ వాధ్రా పోటీచేస్తారని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రకటించేశారు.
నిజానికి ఏ స్థానాన్ని వదులుకోవాలనే మీమాంస రాహుల్ కు క్లిష్టంగానే కనిపించి ఉండవచ్చు. దక్షిణాది రాష్ట్రంలోని భాగం అనే మాట తప్ప.. వయనాడ్ కూడా ఆయనను రాయ్‌బరేలీతో సమానంగానే ఆదరించింది. రెండు సీట్లలోనూ ఆయనకు మెజారిటీ దాదాపు సమానంగానే వచ్చింది. రాయ్ బరేలీలో కేవలం 30వేల ఓట్లు మాత్రమే మెజారిటీ ఎక్కువ. అయినా అక్కడి ప్రజలు కాస్త పెద్ద మెజారిటీ ఇవ్వడం ఒక్కటే ఆయన వయనాడ్ ను వదలుకోవడానికి కారణం కాకపోవచ్చు. తమ కుటుంబాన్ని కొన్ని తరాలుగా ఆదరిస్తున్న ఆ సీటునుంచి వారసుడిగా తానే ఉండాలని అనుకుని ఉండవచ్చు. అదే సమయంలో దక్షిణాదిని ఆయన చిన్న చూపు చూశారనే మాట రాకుండా వయనాడ్ నుంచి ప్రియాంక పోటీకి దిగుతున్నారు.
నిజానికి రాహుల్ రెండు స్థానాల్లో పోటీచేయడానికి ముందే వారు ఈ అంచనాతో ఉన్నట్లుంది. అందుకే ఆమె సార్వత్రిక ఎన్నికల వేళ రంగంలోకి దిగకుండా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. పార్టీని 99 స్థానాల వరకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అన్న ఖాళీ చేస్తున్న స్థానంనుంచి ఎంపీ కాబోతున్నారు.
అయితే ఒక విషయం కీలకంగా గమనించాలి. వామపక్షాలు కాంగ్రెస్ తో పొత్తుల్లో ఉన్న పార్టీలే అయినప్పటికీ.. సీపీఐ వయనాడ్ నుంచి రాహుల్ పై పోటీకి, అన్నీ రాజాను బరిలో దించింది. గత ఎన్నికల్లో కంటె 9వేలు ఎక్కువ ఓట్లు కూడా సాధించారు. కానీ రాహుల్ మెజారిటీ గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 65వేలు తగ్గింది.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తుందనే భ్రమల్లాంటివి లేవు గనుక.. ఉప ఎన్నికలో సీపీఐ మళ్లీ దిగకపోవచ్చు. ఎటూ 3.6 లక్షల మెజారిటీ సాధించిన సీటును దక్కించుకోవడం కష్టమనే క్లారిటీతో కూటమి ధర్మాన్ని ఇప్పుడు పాటించవచ్చు. మొత్తానికి అన్న వారసురాలిగా వయనాడ్ నుంచి ప్రియాంక సభలో అడుగుపెట్టడం ఖరారు అనిపిస్తోంది.