మంత్రి నారా లోకేష్ మొన్న మొన్నటి దాకా తాను పాల్గొన్న ప్రతి సభలోనూ ‘రెడ్ బుక్’ అనే ప్రస్తావన తెస్తూ.. ఆ పదానికి గొప్ప పాపులారిటీ తెచ్చారు. రెడ్ బుక్ అంటేనే నక్సలైట్ల హిట్ లిస్ట్ అన్నట్టుగా పాపులర్ అయింది.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులు అందరి పేర్లు తాను రెడ్ బుక్ లో రాస్తూ వచ్చానని.. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరి భరతం పడతామని వారు చెబుతూ వచ్చారు. అయితే.. మిగిలిన శాఖలు, ఆయా విభాగాల అధికారుల సంగతి ఎలా ఉన్నా.. పోలీసు శాఖకు సంబంధించినంత వరకు జగన్ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించిన వారి వ్యవహారం తేల్చడానికి.. నారా లోకేష్ తయారుచేసిన రెడ్ బుక్ లోని పేజీలను హోంమంత్రి అనిత తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది.
చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల చేతికి మట్టి అంటకుండా.. కార్యం నెరవేర్చడానికి హోం మంత్రి వంగలపూడి అనిత ద్వారా పోలీసు అధికార్ల మీద కన్నెర్ర జేయిస్తున్నారా? అనే మాట వినిపిస్తోంది.
సింహాద్రి అప్నన్న ను దర్శించుకున్న అనిత విలేకర్లతో మాట్లాడుతూ.. పోలీసు అధికార్లకు చాలా హెచ్చరికలే చేశారు. వైసీపీ సర్కారులో కొందరు పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పని చేశారని.. ఇప్పటికీ వారిలో వైకాపా రక్తం ప్రవహిస్తున్నదని వ్యాఖ్యానించారు.
చూడబోతే.. విశాఖ కేంద్రంగా కొందరు అధికారుల పేర్లను మనసులో పెట్టుకునే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వినిపిస్తోంది. అలాంటి అధికారులకు ఇంకా జగన్ పై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీకోసం పనిచేసుకోవాలని ఆమె చెప్పడాన్ని గమనిస్తే.. తెదేపా టార్గెట్ చేసిన పోలీసు అధికారులను శంకరగిరిమాన్యాలు పట్టిస్తారని కూడా అనిపిస్తోంది. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసిన వదిలిపెట్టేది లేదని అనిత అంటున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో తప్ప.. అంతకు ముందు వరకు .. నారా లోకేష్ ప్రతి సభలోనూ అధికారుల్ని విపరీతంగా బెదిరిస్తుండేవారు. తన రెడ్ బుక్ లో అందరి పేర్లు ఉన్నాయని.. వారి సంగతి చూస్తామని అనేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు, అధికార్ల మీద కక్షసాధింపు చర్యలు ఉండవని అన్న మాటలను గమనించి అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనిత మాటలను గమనిస్తే.. కక్ష సాధింపు అనేది చంద్రబాబు స్వయంగా చేయరు గానీ.. తన మంత్రుల ద్వారా చేయించడానికి డిసైడ్ అయ్యారేమో అనిపిస్తోంది.