ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాస్ కి దక్కింది. ఈ పదవిని ఇంతవరకూ నిర్వహించిన కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రి అయ్యారు. మంత్రి పదవిని ఆశించిన పల్లాకు అధ్యక్ష కిరీటం పెట్టారు.
ఈ పదవితో ఆయన పార్టీని పరుగులు పెట్టించాలి. ఇప్పటిదాకా ఉత్తరాంధ్రకే చెందిన కిమిడి కళా వెంకటరావుకు అచ్చెన్నాయుడు ఈ పదవి దక్కింది. 2014లో కూడా కళాను అధ్యక్ష పదవిలో ఉంచారు. అచ్చెన్నకు మంత్రి ఇచ్చారు. దాంతో తనకు మంత్రి పదవి కావాలని కళా కోరుకున్న మీదట 2017లో ఆయనకు ఆ పదవి దక్కింది. ఆయన రెండు పదవులునూ ఒంటి చేత్తో చేపట్టారు.
టీడీపీ ఓడిన రెండేళ్ల పాటు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలా అత్యధిక కాలం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకునే ప్రాంతీయ పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రాంతీయ పార్టీగానే గుర్తింపు ఉంది.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కో చోటా చట్ట సభలలో కనీసంగా రెండు సీట్లు ఆరు శాతానికి పైగా ఓట్లూ సాధిస్తే అపుడు జాతీయ గుర్తింపు దక్కుతుంది. టీడీపీకి తెలంగాణ మీద ఆశలు ఉన్నాయి. మూడవ చోటున పోటీ అంటే ఎక్కడా అని ఆలోచించాల్సి ఉంటుంది.
టీడీపీ అధినాయకత్వం ఏపీలోనే ఉంటుంది. కాబట్టి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఏమి చేయాలన్నది ఆలోచించుకునే చేయాల్సి ఉంటుంది. జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా చంద్రబాబు, చినబాబు ఉన్నారు. పల్లాకు ఈ పదవి ఇచ్చారు బాగా పనిచేయమన్నారు.
బాగానే ఉంది కానీ హాయిగా మంత్రి పదవిలో ఉంటే అధికారానికి అధికారం దర్జా అన్నీ ఉంటాయి కదా అన్న వారూ ఉన్నారు. అయితే అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేరు కాబట్టి ఈ రకంగా పార్టీ పదవులనూ పంచుతున్నారు. హోం మంత్రిగా నియమితులైన వంగలపూడి అనిత వద్ద ఉన్న తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా రేపు మరొకరికి ఇస్తారు.
అలాగే మరికొందరికి పొలిట్ బ్యూరో మెంబర్ షిప్ ఇస్తారు. అధికార పార్టీలో నాయకత్వం అంటే ఎంతో కొంత దర్జా ఉంటుంది కాబట్టి అలా ముందుకు సాగిపోవాల్సిందే. పల్లా ఇప్పటికి మూడు సార్లు గాజువాక నుంచి పోటీ చేస్తే రెండు సార్లు గెలిచారు. సీనియర్ నేత. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ఏపీలోనే అత్యధిక మెజారిటీ దక్కింది. మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. ఇపుడు ఏపీ అధ్యక్ష పదవితో ఆయన తన హవా చాటుకోవాల్సి ఉంటుంది.