ఒకే కుటుంబంలో కీలక పదవులు ఇద్దరికి దక్కడం అరుదుగా జరిగే సంఘటనలు. అది కింజరాపు కుటుంబంలోనే జరిగింది. బాబాయ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన కేబినెట్ మంత్రి. అబ్బాయ్ కేంద్రంలో కేబినెట్ మంత్రి. ఇలా ఇద్దరూ ఒకే సమయంలో అధికారాన్ని అందుకున్నారు.
వారి మీద టీడీపీ అంత నమ్మకం ఉంచింది. దాని కంటే ముందు శ్రీకాకుళం జిల్లా ఎంతో విశ్వాసం ఉంచి గెలిపించింది. అలా అన్నీ కలసి వచ్చి అందలాలు అందాయి. ఇపుడు ఈ ఇద్దరి మీదనే అందరి చూపూ ఉంది. ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా దశను దిశను మార్చే సత్తా ఈ ఇద్దరికీ ఉంది.
బాబాయ్ అబ్బాయ్ తలచుకుంటే విభజన తరువాత పూర్తిగా కునారిల్లిన శ్రీకాకుళానికి కొత్త వెలుగులు అద్దవచ్చు. అనేక ప్రాజెక్టులు తీసుకుని రావచ్చు. విభజన చట్టం లో ఉన్నవి ఏవీ అమలు కాలేదు. దాంతో వెనకబాటుతనం శాపంగా శ్రీకాకుళం జిల్లా అలాగే ఉంది
జిల్లాకు ఒకటి రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినా కేంద్రం నుంచి తీసుకుని రావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు మీద ఉంది. అలాగే ఏపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు జిల్లాకు కొత్త పరిశ్రమలు తేవాలి. అలాగే మూతపడిన ఫెర్రో ఎల్లాయీస్, జ్యూట్ వంటి పరిశ్రమలను తెరిపిస్తే ఉపాధి అవకాశాలు దక్కుతాయి.
వంశధార ప్రాజెక్టు పూర్తికి చర్యలు చేపట్టాలి. ఫిషింగ్ హార్బర్, జెట్టీలను పూర్తి చేయాలి. వైసీపీ ప్రారంభించిన మూలపేట పోర్టుని కూడా సకాలంలో పూర్తి చేయాలి. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం కలిగించాలి. శ్రీకాకుళం అభివృద్ధి చెందితే కింజరాపు కుటుంబానికే ఆ కీర్తి దక్కుతుంది. కింజరాపు కుటుంబాన్ని 1983 నుంచి అదరిస్తున్న జిల్లా ప్రజల రుణం తీర్చుకున్నట్లు అవుతుంది అని అంటున్నారు.