హీరో, దర్శకుడు లేకుండానే ప్రచారం

ఇప్పటికే ఈ మూవీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ హీరోయిన్, ఇప్పుడు ప్రచార బాధ్యతల్ని కూడా భుజానికెత్తుకుంది.

సాధారణంగా ఏ సినిమా ప్రచారానికైనా హీరో ముందుకురావాలి. అదే చాలా ముఖ్యం. హీరో వల్ల కాకపోతే హీరోయిన్ లేదా దర్శకుడు రావాలి. బ్యానర్ కు ఉన్న క్రేజ్ బట్టి నిర్మాత కూడా ఒక్కోసారి లీడ్ తీసుకుంటాడు. అయితే హరిహర వీరమల్లు సినిమాకు ఇవేం లేవు.

ఈ సినిమాకు ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ ముందుకు రారు. సాధారణంగానే ఆయన తన సినిమాల ప్రచారాన్ని పట్టించుకోరు. ఇప్పుడు రాజకీయాలతో బిజీ కాబట్టి అస్సలు అటువైపు చూడరు. దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రచారానికి వస్తాడా రాడా అనేది డౌట్.

ఇక రెండో దర్శకుడు జ్యోతికృష్ణ ప్రచారం కోసం ముందుకొచ్చినా బజ్ రావడం కష్టం. నిర్మాత ఏఎం రత్నం సంగతి సరేసరి. సో.. ఈ సినిమాకు మిగిలిన ఒకే ఒక్క ప్రచారాస్త్రం నిధి అగర్వాల్.

ఇప్పటికే ఈ మూవీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ హీరోయిన్, ఇప్పుడు ప్రచార బాధ్యతల్ని కూడా భుజానికెత్తుకుంది. దాదాపు 2 వారాల పాటు నిధి అగర్వాల్ తో వివిధ ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేశారు. వీటిలో సిటీ టూర్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందనే ఒకే ఒక్క ఆశతో, తెగ కష్టపడుతోంది నిధి అగర్వాల్.

2 Replies to “హీరో, దర్శకుడు లేకుండానే ప్రచారం”

Comments are closed.