చైనా అనగానే మనకు శత్రుదేశంగానే తోస్తుంది. 1963 వరకు హిందీ-చీనీ భాయ్‌భాయ్ అంటూండేవారు. 1963లో మన దేశంపై హఠాత్తుగా దాడి చేసి, కొంత భూభాగాన్ని ఆక్రమించిన దగ్గర్నుంచి మనం వాళ్లని అసహ్యించుకోవడం మొదలుపెట్టాం. ‘ఇంగ్లీషు వాళ్లు గీసి పారేసిన సరిహద్దు రేఖలను మేం పట్టించుకోం.’ అంటూ చైనా హిమాలయాలను అలా, అలా ఆక్రమిస్తూనే పోతోంది. మన పాలకులు దీన్ని సహించం, సహించం అంటూనే సహిస్తూ వస్తున్నారు. అయితే పాకిస్తాన్‌కు, దీనికీ తేడా ఏమిటంటే పాకిస్తాన్‌లా చైనా మన దేశంలో హింసకు, టెర్రరిజానికి పాల్పడదు. గూఢచార్యం చేస్తున్నా మరీ బాహాటంగా చేయదులాగుంది, చైనా గూఢచారులు పట్టుబడిన వార్తలు పేపర్లలో రావు. పాకిస్తాన్ మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తే, చైనా మన దేశం వర్ధిల్లుతూ దాని సామాన్లు యితోధికంగా కొనుక్కునే సామర్థ్యం తెచ్చుకోవాలని చూస్తుంది. నిజానికి చైనా మనకు ఎగుమతులు ఆపేస్తే మనం మందులు సైతం లేక గిలగిల్లాడాల్సిందే.
ఇవన్నీ రాజకీయ, ఆర్థిక క్షేత్రాలకు సంబంధించినవి. సాంస్కృతిక రంగానికి వస్తే, మనకు చైనా సాహిత్యం, సంగీతం, నృత్యం ఏమీ తెలియవు. యుఎస్‌ఎస్‌ఆర్ ఉండే రోజుల్లో రష్యన్ సాహిత్యాన్ని మన స్థానిక భాషల్లో అనువదించి, అతి చౌకగా పుస్తకాలు అందించడంతో మనకు రష్యన్ కవులు, రచయితలు చాలామంది తెలుసు. చైనా విషయంలో మనకు అలాటి సౌలభ్యం లేదు. కన్‌ఫ్యూషియస్ సూక్తులు విన్నాం. సాయుధ పోరాటాలు చేయవలసిన తీరు గురించి మావో రాసిన పుస్తకాలు నక్సలైట్లు చదివేవారు కానీ, మామూలు జనాలు చదవలేదు. క్రీస్తు పూర్వం నాటి చైనీస్ మిలటరీ జనరల్ సూన్ సూ రాసిన ‘‘ఆర్ట్ ఆఫ్ వార్’’ పుస్తకం మాత్రం ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. వీళ్లు తప్ప చైనీస్ రచయితలెవరూ మనకు తెలియదు.
ఈ మధ్య భారతీయ సినిమాలు చైనాలో ఆడుతున్నాయి. ‘‘దంగల్’’ అక్కడ బాగా ఆడడంతోనే రికార్డు నెలకొల్పింది. నెట్‌ఫ్లిక్స్ వచ్చాక కొరియన్ సీరీస్ చూసిచూసి, ఆ మొహాలకు అలవాటు పడి, పక్కనే రికమెండేషన్ అంటూ వచ్చి పడుతున్న మాండరిన్ సీరీస్ కూడా చూడడానికి ధైర్యం చేస్తున్నాం, రుచి చూస్తున్నాం. క్రమేపీ చైనా గురించి మనకు అవగాహన పెరగవచ్చు. వ్యాపారబంధాలు ఎలాగూ ఉన్నాయి. ఇలాటి పరిస్థితుల్లో చైనా జాతీయుడైన ఒక వ్యక్తి సంస్కృతంలో పండితుడని, మన మహాభారతాది కావ్యాలను వాళ్ల భాషలోకి అనువదించే పని 1996 లోనే మొదలు పెట్టాడని విన్నప్పుడు ముచ్చట వేస్తుంది. నిజానికి చైనా పండితులకు భారతదేశమంటే బుద్ధుడి జన్మభూమిగా ఎప్పుడూ గౌరవం ఉండేది. బుద్ధుడి రచనలు సంస్కృతం, పాళీ భాషల్లో ఒరిజినల్‌గా ఉన్నాయని తెలుసు వారికి. అవి చైనా లోని వివిధ భాషల్లోకి అనువదింపబడడంలో పొరపాట్లు జరిగాయని తెలుసుకుని మూల గ్రంథాలను అన్వేషిస్తూ ఇండియాకు వచ్చిన ఫాహియన్, హ్యూయన్ త్సాంగ్‌ల గురించి మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం.
హ్యూయన్ త్సాంగ్ క్రీ.శ. 7 వ శతాబ్దం వాడు. అతను చైనాకి తిరిగి వెళ్లి సరైన పద్ధతిలో బౌద్ధం, సంస్కృతం నేర్పి అనేకమంది పండితుల్ని తయారు చేశాడు. కొన్ని శతాబ్దాలు గడిచేసరికి బౌద్ధం బాగా వేళ్లూనుకుంది కానీ సంస్కృతాధ్యయనం క్రమేపీ కనుమరుగైంది. జీ జియాన్‌లిన్ (1911-2009) అనే ఆయన చైనాలో ప్రముఖ ఇండాలజిస్టు. (భారతదేశం గురించి అధ్యయనం చేసే పండితుడు). ఆయన 1935లో జర్మనీ వెళ్లి సంస్కృతం, పాళీ భాషలు నేర్చుకున్నాడు. 1946లో చైనాకు తిరిగి వచ్చి పీకింగ్ (బీజింగ్) యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరాడు. అక్కడే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఈస్టర్న్ లాంగ్వేజెస్ ప్రారంభించి దానికి డీన్ అయ్యాడు. 1960లో పీకింగ్ యూనివర్శిటీలో సంస్కృతం కోర్సు ప్రారంభించాడు. మావో అధికారంలోకి వచ్చాక ‘సాంస్కృతిక విప్లవం’ (1966-76) పేరు పెట్టి, కమ్యూనిస్టు భావాలు లేని మేధావులందరినీ వేధించాడు, హింసించాడు. ఆ సమయంలో తరతరాల సాంస్కృతిక మూలాలను తుడిచిపెట్టేసే ప్రయత్నం కూడా జరిగింది.
జీ కూడా వేధింపులు ఎదుర్కున్నాడు. ఎదుర్కుంటూనే రహస్యంగా సంస్కృత రామాయణాన్ని చైనీస్ భాషలోకి కవితారూపకంగా రహస్యంగా అనువదించాడు. అది బయట పడి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవి. 1976లో మావో చనిపోయాక, పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎకడమీషియన్స్ ఊపిరి పీల్చుకోసాగారు. జీ 1978లో యూనివర్శిటీ వైస్ ప్రెసిడెంటు అయ్యాడు. ఆయనకు అనేక భాషలు వచ్చు. అనేక రిసెర్చి పేపర్లు ప్రెజంట్ చేశాడు. భారతదేశ చరిత్ర గురించి ఒక పుస్తకం కూడా రాశాడు. నేను యీ వ్యాసంలో ప్రధానంగా చర్చించే హువాంగ్ బావ్‌షెంగ్ తన 18వ ఏట పీకింగ్ యూనివర్శిటీలో సంస్కృత విద్యార్థిగా, జీ శిష్యుడిగా చేరాడు. అతనికి సంస్కృతం అతి క్లిష్టంగా, మిస్టీరియస్‌గా తోచింది. చైనా వాడిగా సంస్కృత పదాలు పలకడానికి నానా అవస్థా పడేవాడు. వేరే భాషకు మారిపోదామా అనుకున్నాడు కానీ ఆ భాష మీద గౌరవంతో, వేదాల మీద భక్తితో కొనసాగాడు. కాలక్రమేణా అనేక భాషలు నేర్చుకున్నాడు.
జర్మనీకి వెళ్లి అక్కడ చాలాకాలం చదివి 1965లో సంస్కృతం, పాళీ భాషల్లో గ్రాజువేట్ పట్టా సంపాదించి, బీజింగ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరి రిటైరయ్యేదాకా అక్కడే పని చేస్తూ, అనేక మంది చైనీస్ సంస్కృత స్కాలర్స్‌ను తయారు చేశాడు. చైనా ఫారిన్ లిటరేచర్ సొసైటీ, ఇండియన్ లిటరేచర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి అనేక సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. 5 దశాబ్దాలు సాగిన ఆయన కెరియర్‌లో వందలాది సంస్కృత పుస్తకాలు చైనీస్‌లోకి అనువదించాడు. వాటిలో భగవద్గీత, ఉపనిషత్తులు, బౌద్ధ గ్రంథాలైన లలితావిస్తార సూత్ర, వజ్రచ్ఛేదిక ఉన్నాయి. అన్నిటి కంటె ప్రముఖంగా చెప్పుకోవలసినది మహా భారతం.
మహాభారతాన్ని చైనీస్‌లోకి అనువదించే ప్రాజెక్టు 1989లో జిన్ కెము, ఝావ్ గువోహ్వాలకు యూనివర్శిటీ అప్పగించింది. 1993 నాటికి ఆదిపర్వం పూర్తయింది. ఆ తర్వాత మూడేళ్ల విరామం వచ్చింది. 1996లో చైనీస్ ఎకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కాస్) అధిపతిగా ఉన్న యీయన నేతృత్వంలో 5 గురు సభ్యుల టీము ఏర్పడి, అందరూ కలిసి 2003 నాటికి 18 పర్వాలూ పూర్తి చేశారు. ఈయన స్వయంగా అవన్నీ సరి చూసి, ఫైనలైజ్ చేసి, చైనీస్ సోషల్ సైన్స్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా ప్రచురించే సరికి 2005 డిసెంబరు వచ్చింది. అది వెనువెంటనే పునర్ముద్రణకు కూడా వచ్చింది. చైనా ప్రభుత్వం యీయనకు ఎవార్డు యిచ్చింది కూడా.
చైనీస్ భాషలో ఉండే కావ్యాలు, గొప్ప గ్రంథాలు మన భారతీయ భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు యూనివర్శిటీ పక్షాన జరిగినట్లు, ప్రభుత్వం వాటిని మెచ్చి ఎవార్డులు యిచ్చినట్లు నాకైతే తెలియదు. ఇండో-చైనా సొసైటీ పేర కొందరు అతివాద కమ్యూనిస్టులు ఓ సంఘంగా ఏర్పడి చైనీస్ నవలలు తెలుగులోకి అనువదించినట్లు లీలగా గుర్తు, కానీ నేనెప్పుడూ చదవలేదు. చైనా చరిత్ర గురించి, రాజకీయాల గురించి పాశ్చాత్యులు రాసిన పుస్తకాలు చదివాను తప్ప, అక్కడి కావ్యాల, ఉద్గ్రంథాల గురించి నాకు తెలియదు. రాజకీయాల సంగతి పక్కన పెడితే, భారత్‌తో సమానమైన ప్రాచీన నాగరికత ఉన్న చైనాకు ఎంతో సాహిత్యం, సంగీతం ఉన్నాయి. కానీ మనకు బొత్తిగా తెలియదంతే. మన సంస్కృతిని, సంస్కృతాన్ని వాళ్లు గౌరవించడం మనకు ఆనందం కలిగించే విషయం.
ఈ ఉత్కృష్ట కార్యానికి నేతృత్వం వహించిన హువాంగ్ గారిని సత్కరించడానికి కేంద్ర హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ (ఎచ్‌ఆర్‌డి) క్రింద పని చేసే రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ అనే డీమ్‌డ్ యూనివర్శిటీ 2011 ఆగస్టు 15న ఆయనకు ప్రెసిడెంట్స్ సర్టిఫికెట్ ఆఫ్ ఆనర్ ప్రకటించింది. ఆ ఏడాది ఆ ఎవార్డు పొందిన విదేశీయుడు ఆయన ఒక్కడే. సర్టిఫికెట్‌తో పాటు రూ.5 లక్షలు యిస్తామన్నారు. అప్పటికే 72 ఏళ్ల వయసులో కంటి సమస్యలతో బాధపడుతున్న హువాంగ్ ఇండియాకు వచ్చి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా స్వయంగా ఎవార్డు తీసుకోలేక పోయారు. ఇక యిక్కణ్నుంచి బ్యూరోక్రాటిక్ వ్యవహారాలు యీ సాంస్కృతిక వ్యవహారాలను ఎలా చికాకు పరిచాయో బీజింగ్ నుంచి ‘‘ఇండియా టుడే’’ ప్రతినిథి అనంత్ కృష్ణన్ 2014 డిసెంబరు 8 ‘‘ఇండియా టుడే’’ సంచికలో వివరంగా రాశారు.
మన సంస్థాన్ హువాంగ్‌కు సర్టిఫికెట్టు కాపీ ఈమెయిల్ చేసింది కానీ డబ్బు మాత్రం తొక్కి పెట్టింది. ‘మేం ఒక ఫామ్ పంపిస్తాం. దాన్ని ఏదైనా చైనీస్ బ్యాంకు సైన్ చేసి ఎటెస్ట్ చేయాలి. అప్పుడే డబ్బు పంపిస్తాం.’ అనే షరతు పెట్టింది. హువాంగ్ సెక్రటరీ ఇటింగ్ అనే ఆమె ఆ ఫామ్ పట్టుకుని చైనీస్ బ్యాంకుల దగ్గరకు వెళితే ‘చైనీస్ ప్రభుత్వ ఏజన్సీలు జారీ చేయని ఏ ఫామ్ మీదా మేము ఎటెస్ట్ చేయకూడదు. ఇది విదేశాలకు సంబంధించిన సంస్థ పంపిన ఫామ్. కావాలంటే, మా దగ్గరున్న హువాంగ్ ఖాతాల గురించి, ఒక స్టాండర్డ్ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్ యివ్వగలం. అది తప్ప హువాంగ్ గురించి వ్యక్తిగతంగా ఏ డిక్లరేషన్ యివ్వం. ఇంతకు మించి మేమేం చేయలేం.’’ అన్నారు.
ఇలా తిరిగితిరిగి వేసారి, ఇటింగ్ 2013 ఆగస్టులో ‘ఇదిగో యిదీ మా వాళ్ల పాలసీ. హువాంగ్ నివాసముంటూ ఖాతాలు కలిగి ఉన్న బ్యాంకు డిపాజిట్ల వివరాల సర్టిఫికెట్లు పంపుతున్నాను. ఆయన జీవించి ఉన్నాడని యిదే నిదర్శనం. మీరు యీ ఖాతాలకు డబ్బు పంపగలరు.’’ అని సంస్థాన్ వాళ్లకు, ఎచ్‌ఆర్‌డి వాళ్లకు రాస్తే వాళ్లు సమాధానం యివ్వలేదు. 2014 ఏప్రిల్‌లో ఆమె బీజింగ్ లోని ఇండియన్ ఎంబసీకి రాసింది. ఎంబసీ వాళ్లు అసలీ హువాంగ్‌కు ఎవార్డు యిచ్చినట్లే మాకు తెలియదు పొమ్మన్నారు. ఈమె వాళ్లకు ఓ కాపీ పంపింది. ఈ కథనం వెలువడిన 2014 డిసెంబరు వరకు వాళ్లు జవాబు యివ్వలేదు. ఈ రిపోర్టరు సంస్థాన్ ప్రాజెక్ట్ ఇన్‌చార్జిని అడిగితే ‘2013లో హువాంగ్ విద్యార్థి ఒకడు వచ్చి సర్టిఫికెట్టు, శాలువా పట్టికెళ్లాడు. ప్రైజు మనీ ఎందుకు వెళ్లలేదో మాకు క్లారిటీ లేదు.’ అనేసిందావిడ.
బ్యాంకుల మధ్య ఫార్మాలిటీస్ సమస్య ఉంటే దాన్ని సాల్వ్ చేయాలన్న తపనే లేదు యీ అధికారులకు. దేశంలో అనేక వాటికి మినహాయింపులు యిస్తూ ఉంటారు. అక్రమ భూములను కూడా క్రమబద్ధీకరించేస్తూ ఉంటారు. ఒక్కోప్పుడు ఒక్కో సర్టిఫికెట్టు చాలకపోతే, దొరక్కపోతే ఎగ్జెంప్షన్ యిస్తారు. రాష్ట్రపతులు ఉరి పడినవారికి కూడా క్షమాభిక్ష పెడుతూ ఉంటారు. ఇక్కడకి వచ్చేసరికి, అడ్డంకులు పెట్టి ఆపేశారు. సంస్కృతం పేర పెట్టిన ప్రభుత్వ సంస్థ చైనా భాషలోకి మహాభారతం (దానితో పాటు అనేక గ్రంథాలు) సంస్కృతంలోకి అనువదించిన ఒక చైనీస్ పండితుడి పట్ల వ్యవహరించిన తీరు యిది! ఈ రూ.5 లక్షలు ఆయనకు పెద్దగా చిన్నదా? పెద్దదా? దాంతో ఏం కొనుక్కోగలడు అనేది కాదు విషయం. విడిగా ఎంత డబ్బు ఉన్నా, సత్కారంలో 1116 రూ.లు యిచ్చినా ఎంతో గౌరవంగా ఫీలవుతాం. ప్రమాదంలో మనిషి చచ్చిపోయాడంటే చాలు 5 లక్షలు, 10 లక్షలు ఎడాపెడా యిచ్చే ప్రభుత్వాధికారులు యిలాటి విషయాల్లో మాత్రం పీటముడి వేయడం నాకు విస్మయం కలిగించి, ఎప్పటికైనా ఆయనకు న్యాయం కలుగుతుందా గమనించాలి అనుకుని ఆ ఆర్టికల్‌ను జాగ్రత్త పెట్టుకున్నాను.
రిపోర్ట్ రాసిన అనంతకృష్ణన్ హువాంగ్ దగ్గరకు వెళ్లి మాట్లాడితే ఆయన ఎవార్డు వచ్చినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సర్టిఫికెట్టు మీకందింది సరే ప్రైజ్ మనీ సంగతేమిటి అని అడిగితే చాలా యిబ్బంది పడిపోయాడు. సమాధానం చెప్పడానికి యిష్టపడలేదు. రొక్కించి అడిగితే రాలేదని చెప్పాడట. ‘‘దాని సంగతి వదిలేయండి, మా చైనా వాళ్లకు సంస్కృతం అంటే భారతదేశాన్ని, దాని సంస్కృతిని, ఫిలాసఫీని, ఆలోచనావిధానాన్ని, జీవనసరళిని, యితిహాసాలను అర్థం చేసుకునే ఉత్తమ సాధనం. మాండరిన్ సంస్కృతం, ఇంగ్లీషులలా ఇండో-యూరోపిన్ లాంగ్వేజి కాదు కాబట్టి మాకు సంస్కృతాధ్యయనం చాలా క్లిష్టం. అయినా నా విద్యార్థుల్లో చాలామంది సంస్కృతాన్ని, బౌద్ధాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అదీ నాకు సంతోషదాయకం.’’ అన్నాడాయన.
అయితే ఆ విద్యార్థులు ఇండియన్ యూనివర్శిటీలకు వచ్చి సంస్కృతం నేర్చుకోవడానికి చాలా అవరోధాలున్నాయని బీజింగ్‌లో ఉండే ఒకతను చెప్పాడు. ‘‘మేమెవరైనా షార్ట్ టెర్మ్ కోర్స్ చేయాలంటే కుదరదటం లేదు. లాంగ్ టెర్మ్ కోర్స్‌కి అవసరం పడేటంత తతంగం జరపాలంటున్నారు. షార్ట్ టెర్మ్‌కి వీసాలు యివ్వటం లేదు. ఈ బాధలు పడలేక మేం జర్మనీ వెళ్లి అక్కడ సంస్కృతం నేర్చుకుంటున్నాం.’’ అంటున్నారు. 72 ఏళ్ల కంటి బాధలున్నా, హువాంగ్ తన అనువాద క్రతువును సాగిస్తూనే ఉన్నారు.’ అని యీ పత్రికా కథనం ముగిసింది. ఈయన కథ ఆసక్తికరంగా ఉండటంతో నేను యీయన గురించి మన ప్రభుత్వం పట్టించుకుందా లేదా అని ఫాలో అవుతూ వచ్చాను.
2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ బహూకరించింది. వచ్చి స్వయంగా తీసుకున్నట్లు లేదు. 2016 సెప్టెంబరులో ప్రధానిగా మోదీ చైనా వెళ్లినపుడు సంస్కృతం అభ్యసిస్తున్న యీయన శిష్యులు 30 మంది మోదీకి మహాభారతాది కావ్యాల సంస్కృత అనువాదాలను బహూకరించారు. సంస్కృతం షార్ట్ టెర్మ్ కోర్స్ నేర్చుకోవడానికి ఇండియన్ యూనివర్శిటీలు కల్పిస్తున్న అవరోధాలు తొలగిపోలేదని, తాము జర్మనీ వెళ్లాల్సి వస్తోందని చెప్పుకున్నారు. 2023లో చైనా ప్రభుత్వం అనువాదాల ద్వారా చైనాకు విదేశాలతో సత్సంబంధాలు కలిగేట్లా కృషి చేస్తున్న 11 మందికి ట్రాన్స్‌లేటర్స్ అసోసియేషన్ ఆఫ్ చైనా తరఫున ఏప్రిల్‌లో ఎవార్డులు ప్రకటిస్తే యీ హువాంగ్ వారిలో ఒకరు. కానీ ఆ ఎవార్డు ప్రకటించడానికి నెల ముందే ఆయన తన 80 వ ఏట 2023 మార్చిలో మరణించారు.
ఆయన గురించి మనకు పెద్దగా తెలియకపోయినా, మన భాష గురించి, మన సంస్కృతి గురించి తన దేశంలో వ్యాప్తి చేసి, కృషి చేసిన మహానుభావుడు కాబట్టి ఆయనకు అంజలి ఘటిస్తున్నాను. ఇంతకీ ఆయనకు రూ.5 లక్షలు ముట్టిందా లేదా అన్న ప్రశ్న నన్ను వేధిస్తోంది. నేనే స్వయంగా అప్పు ఉన్నానా అన్న ఫీలింగు దొలిచివేస్తోంది. ఈ బ్యూరోక్రాట్ వ్యవహారాలు కాదు కానీ యిలాటి చిన్న విషయాలపై నిర్ణయాలు ఎప్పటికీ తేల్చరు. ఫైళ్లు కాలగర్భంలో కలిసిపోతాయి. ఆయన మాట సరే, 2016లోనే మోదీ దృష్టికి వెళ్లిన యిప్పటికైనా సంస్కృతం చదువుకుందా మనుకున్న చైనీస్ విద్యార్థుల సమస్య తీరిందా లేదా తెలియటం లేదు. వాళ్లు జర్మనీ వెళ్లనక్కరలేకుండా పక్కనున్న మన దేశానికి వచ్చేట్లా మన యూనివర్శిటీలు నిబంధనలు సడలించాయా లేదా అన్నది కూడా నాకు నెట్‌లో ఎక్కడా దొరకలేదు. అధికారులు పోనీ అదైనా చేస్తే బాగుండును. (ఫోటోలు – హువాంగ్, 2016 మోదీ పర్యటన సందర్భంగా, 2023 హువాంగ్‌కి చైనా వారి మరణానంతర ఎవార్డు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2025)
Mee erra medhavulaki chaina prema. Shanti kapota sodarulaki pakistan prema.
డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఇండియా లో వున్న నిబంధనలు బాధిస్తాయి. నేను కొన్నేళ్ల క్రితం, విదేశాల నుంచి మా అమ్మగారికి మనీ ఆర్డర్ పంపాను. పంపిన కొన్ని రోజులకే ఆమె పరమపదించారు. నేను ఇండియా వచ్చి అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేసి, మా అమ్మగారు పరమపదించారు, ఆమె ఇప్పుడు లేరు కాబట్టి నేను పంపిన మనీ ఆర్డర్ నాకు ఇప్పించవలసిందిగా , పోస్టుమాస్టర్ ని విన్నవించుకున్నా, వారు రూల్స్ ఒప్పుకోవు అని తిరస్కిరంచారు. మేము తిప్పి పంపుతాం, మీరు, మీరు పంపిన దేశం లో తీసుకోండి అని ఒక ఉచిత సలహా ఇచ్చారు. నేను తిరిగి వెళ్లిన తరువాత అక్కడి పోస్ట్ ఆఫీస్ లో సంప్రదిస్తే ఆ డబ్బు తిరిగి రాలేదు కానీ, మానవతా దృక్పథం తో మేము నీకు తిరిగి ఇస్తాము అని ఇచ్చారు. మన అధికారుల అతి ఒకోసారి చాల ఇబ్బందిగా ఉంటుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
If chines govt have restrictions on its citizens to accept award money from foreign countries, and banks dont have directions what way indian govt have to correct its policy. For travel and study China govt put lot of restrictions on its citizens then which way indian govt have to correct its policy.