ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడోటర్మ్ పరిపాలన ఎలా ఉండేదో ఇప్పుడు మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సోమవారం అంటే పోలవారం అంటూ ఆయన ఒక నినాదంలాగా దానిని ప్రచారం చేసుకున్నారు.
ప్రతి సోమవారం.. పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి మీటింగులు పెట్టేవారు. సాయంత్రానికి పెద్దపెద్ద ప్రెస్ నోట్ లు వచ్చేవి. మీటింగ్ జరుగుతుండగానే.. పనుల గురించి డ్రోన్ వీడియోలను లైవ్ లో వీక్షించే వారు. ఇలా చాలా రకాల హంగామా నడిచేది. చంద్రబాబు 4.0 ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత.. తొలి సోమవారమే ఆయన ఆ వ్యవహారాన్ని పునరుద్ధరించారు. స్వయంగా పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి. పనులు ఎక్కడిదాకా వచ్చాయో పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఆయనను ప్రధాన బాధ్యుడిగా చిత్రీకరించడానికి చంద్రబాబు ఎక్కువ తాపత్రయ పడినట్టుగా కనిపించింది. చంద్రబాబు అప్పట్లో అయిన వారికి కాంట్రాక్టులు ఇచ్చి ఉండగా, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా వందల కోట్లరూపాయలు మిగిలేలా మేఘా సంస్థకు అవే కాంట్రాక్టుల్ని కేటాయించారు.
పాత కాంట్రాక్టర్లను తొలగించారు. అది చంద్రబాబుకు కంటగింపు వ్యవహారంగా తయారైంది. ఇప్పుడు జగన్ నియమించిన కాంట్రాక్టర్లను మార్చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్టుగా ఈ ప్రెస్ మీట్ లోనే సంకేతాలు అందుతున్నాయి. ఏజన్సీలను మార్చడం వల్లనే ప్రాజెక్టు ఆలస్యం అయిందని చంద్రబాబు తేల్చేశారు. కేంద్రంనుంచి నిధుల విడుదలలో జాప్యాల గురించి ఆయన ఏమాత్రం ప్రస్తావించను కూడా లేదు. ఈ పోకడ చాలా క్లియర్ గా అర్థమైపోతోంది.
జగన్ ను నిందించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. రాష్ట్రానికి జగన్ శాపంలాగా మారారని అందువల్లనే ఇది పూర్తికాలేదని అన్నారు. అయినా ఇక్కడ చంద్రబాబు గమనించాల్సింది ఒకటి ఉంది. ఆయన జగన్ ను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రజలు ఎటూ తీర్పుచెప్పేసి.. ఆయనను ఓడించారు. చంద్రబాబునాయుడు కార్యకుశలత గలవాడు అని నమ్మారు.
ఇప్పుడు ఆయనను జగన్ ను నిందిస్తే కొత్తగా వచ్చేదేం లేదు. కానీ తన కార్యసమర్థత నిరూపించుకోకపోతే మాత్రం, కొత్తగా వచ్చే నష్టం చాలా ఉంది. కేవలం జగన్ మీదకు నెట్టేస్తూ ఆయన జీవితకాలం గడిపేయలేరు. తాను ఈ ప్రాజెక్టును ఎప్పటికి పూర్తిచేయాలనుకుంటున్నారో.. ఆయన మాట మాత్రంగా కూడా చెప్పలేదు. ఆ విషయాలను గుర్తుంచుకుని.. పోలవరం ప్రాజెక్టుకు న్యాయం చేస్తే బాగుంటుంది.