రుషికొండపై భారీ నిర్మాణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ భవనాలు జగన్ లేదా వైసీపీ నేతల సొంత నిర్మాణాలంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ ప్రభుత్వ భవనాలన్నారు. అధికారంలోకి వచ్చిన వారు, ప్రభుత్వ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించాలని హితవు చెప్పారు.
రుషికొండపై ప్రభుత్వ భవనాల నిర్మాణంపై టీడీపీ దుష్ప్రచారంపై ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. రుషికొండపై భవనాల నిర్మాణాలపై పర్యావరణం పేరుతో న్యాయస్థానాలకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు. నాలుగైదు నెలల క్రితం రుషికొండపై భవనాలను ప్రారంభించామన్నారు. ఆ భవనాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలో అధికారంలో ఉన్న వారు ఆలోచించడం మానేసి, దాన్ని ఇంకా జగన్ సొంతిల్లు అన్నట్టు చిత్రీకరించడం సమంజసం కాదని ఆయన అన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని అనుకున్నామని, దానికి అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించారన్నారు.
రుషికొండపై భవనాల నిర్మాణాల్ని టీడీపీ తప్పుదోవ పట్టిస్తున్న క్రమంలో 2014-19 మధ్య కాలంలో చంద్రబాబునాయుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారో మాట్లాడాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో సొంతింటిని నిర్మించుకునే క్రమంలో కుటుంబ సభ్యులందరినీ ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారని గుర్తు చేశారు.
కొత్త ప్రభుత్వంపై విమర్శల జోలికి ఇప్పుడే తాము వెళ్లదలుచుకోలేదన్నారు. ఆరు నెలలో, సంవత్సరం పాటు సమయం ఇవ్వాలని అనుకున్నట్టు ఆయన చెప్పారు. 2019లో విశాఖ రాజధాని అంటే, మొదట స్వాగతించింది గంటా శ్రీనివాసరావే అన్నారు. రుషికొండ ఎదురుగా ఉన్న గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఆక్రమణలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. దాదాపు 23 ఎకరాలను ఆక్రమించారన్నారు. అందులో 13 ఎకరాల్లో ఏకంగా నిర్మాణాలు చేశారన్నారు.
దాన్ని బయట పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గీతం అక్రమణలను చూపించి వుంటే బాగుండేదని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని తాము విమర్శించడానికి, అలాగే తమపై వారు దుష్ప్రచారం చేయడానికి ఇది సమయం కాదని గుడివాడ అమర్నాథ్ అన్నారు.