కాలం కలిసి వస్తే ఒకలా వుంటుంది. రాకుంటే మరోలా వుంటుంది. అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు హీరో బన్నీ. నైజాంలో 40 కోట్లకు పైగా షేర్ అంటే మామూలు విషయం కాదు. ఆ ఊపుతో పష్ప చేసారు.. ఇక్కడ మరీ అరి వీర భయంకర హిట్ కాలేదు. ఎందుకంటే బయ్యర్లు పూర్తిగా సేఫ్ కాలేదు కనుక. కానీ నార్త్ బెల్ట్ లో మాత్రం అనుకోని సూపర్ హిట్ గా నిలిచింది. థాంక్స్ టు రష్మిక.. సమంత కూడా. అదే ఊపులో పుష్ప 2 స్టార్ట్ చేసారు.
అక్కడి నుంచి లక్ మొహం చాటేసినట్లు కనిపిస్తోంది. 2020 జనవరిలో అలవైకుంఠపురములో విడుదలైతే, 2021 డిసెంబర్ లో పుష్ప విడుదలైంది. అంటే రెండేళ్లకు ఒక్క సినిమా వచ్చింది. ఆ తరువాత 2024 డిసెంబర్ కు వస్తుందేమో పుష్ప 2. అంటే మూడేళ్లు గ్యాప్. ఓ పెద్ద హీరోకి ఇంతంత గ్యాప్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశే.
పుష్ప 2 మీద విపరీతమైన అంచనాలు వున్నాయి. కచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ కంటెంట్ వస్తుందనే నమ్మకంతో వున్నాయి ట్రేడ్ వర్గాలు. కానీ ఇప్పటికి వచ్చిన రెండు పాటలు బాగున్నాయి అనే టాక్ తప్ప, పుష్ప సాంగ్స్ రేంజ్ కు వెళ్లడం లేేదు ఇంకా. ఇది ఓ సమస్య. అసలు పుష్ప 2 లో తన పార్ట్ వీలయినంత త్వరగా ఫినిష్ చేసి మరో సినిమా చేద్దాం అనుకున్నారు.
ఎవరు అయితే తనకు నప్పే కథను, అది కూడా రెడీగా వుంచి తెస్తే వాళ్లతో చేస్తామన్నారు. పెద్ద దర్శకులు ఎవరూ ఇలా కథ బౌండ్ స్క్రిప్ట్ దగ్గర వుంచుకోరు కదా. లైన్ చెబుతారు. నచ్చితే ఓ మూడు నెలల్లో రెడీ చేస్తారు. కానీ బన్నీ అలా ఒప్పకోకపోవడం వల్ల దగ్గరకు వచ్చిన పెద్ద దర్శకులు అంతా వెనక్కు వెళ్లి వేరే ప్రాజెక్ట్ లు అందుకున్నారు.
ఇప్పుడు పుష్ప 2 కూడా ఆలస్యం అవుతోంది. పబ్లిసిటీ పక్కన పెడితే బన్నీ ఆ సినిమా మీద నుంచి బయటకు రావాలంటే కనీసం జూలై పూర్తి కావాలి. తరువాత పుష్ప 2 విడుదల కావాలి. విశ్రాంతి. ఇవన్నీ చూసుకుంటే మళ్లీ మరో సినిమా స్టార్ట్ చేసి, పూర్తి చేయాలంటే 2025 డిసెంబర్ వచ్చేస్తుంది.
టాప్ లైన్ లో వున్న దర్శకుల్లో త్రివిక్రమ్ తప్ప మరెవరు బన్నీ కోసం రెడీగా లేరు. ఎవరి సినిమాలు వారికి లైన్ లో రెడీగా వున్నాయి. అందువల్ల మళ్లీ త్రివిక్రమ్ తో చేయాలి. ఆ తరువాత పుష్ప 3 చేయాలి.
కొత్తదనం అందిస్తున్న సందీప్ వంగా, ప్రశాంత్ నీల్, అట్లీ, ఇలా చాలా మంది మాస్ డైరక్టర్లతో బన్నీకి సినిమా సెట్ కావడం కష్టం కావచ్చు. ఎందుకంటే బన్నీ ఇన్ వాల్వ్ మెంట్ వుంటుంది., గెటప్ లు, పాటలు, ఫైట్లు ఇలా చాలా విధాలుగా. అది వారికి నచ్చకపోవచ్చు.
ఇవన్నీ ఇలా వుంటే అనవసరంగా ఒక చోటకు స్నేహం కోసం వైకాపా అనుకూల ప్రచారం చేసారు బన్నీ. అది మామూలుగా రివర్స్ కాలేదు. ఎంత రివర్స్ అంటే పుష్ప 2 సినిమా ఏమాత్రం యావరేజ్ అన్నా ట్రోలింగ్ దారణంగా వుండేంత. అసలు మామూలుగానే ఫ్యాన్స్ వార్ ఎక్కువ వుంది బన్నీ విషయంలో. ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ టచ్ అయింది.
ఈ బ్యాడ్ టైమ్ మారాలి అంటే ఒక్కటే జరగాలి. పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టాలి.