న్యాయబద్దంగా చూసుకుంటే పూరి- రామ్ సినిమా డబుల్ ఇస్మార్ట్ కు ఏ చిన్న సమస్య కూడా లేదు. కానీ టాలీవుడ్ లో వున్న పద్దతులు, కట్టుబాట్లు ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా తలనొప్పులు వున్నాయి. టాలీవుడ్ లో ఓసారి అమ్మకం జరిగిపోతే, అంతా అయిపోయినట్లు కాదు. అగ్రిమెంట్లు అన్నీ పక్కాగా వున్నా, ఎవరికీ ఏ రూపాయి ఇవ్వక్కరలేకపోయినా, అలాగే వుండదు. సినిమా డిజాస్టర్ అయితే ఎంతో కొంత వెనక్కు ఇచ్చి బయ్యర్లను, ఎగ్జిబిటర్లను ఆదుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తోంది.
లైగర్ సినిమా అరి వీర డిజాస్టర్. అందులో సందేహం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా రేంజ్ చూసుకుని, పూరి- విజయ్ దేవరకొండ కాంబినేషన్ చూసి, గుడ్డిగా, ఏమీ ఆలోచించకుండా కొనేసారు. నిజానికి ఏ విధమైన రిటర్న్ వుండదు అనే కండిషన్ అగ్రిమెంట్ మీదే సినిమాను అమ్మారు. అందువల్ల లీగల్ గా వెళ్తే ఏ అవకాశం వుంది. కానీ టాలీవుడ్ లో వున్న కట్టుబాట్ల వల్ల సమస్యలు వుంటాయి.
సినిమాను వరంగల్ శ్రీను కొనుక్కున్నారు. కానీ కొంత వరకు ఆయన కూడా డబ్బులు కట్టడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల చదలవాడ శ్రీనివాసరావు, శొభన్ లాంటి పేర్లు కూడా కలిసాయి. మొత్తం మీద సినిమా అమ్మకంలో చాలా పేర్లు కలిసాయి. అందువల్ల పూరి కనుక డబ్బులు వెనక్కు ఇస్తే, ఎంత ఇస్తారు? ఎవరికి ఇస్తారు అన్నది ఓ పాయింట్.
ఇదిలా వుంటే వరగల్ శ్రీను రెగ్యులర్ గా సినిమాలు చేసే డిస్ట్రిబ్యూటర్ కాదు. అందువల్ల ఎగ్జిబిటర్లతో ఓ కంటిన్యూ అక్కౌంట్ అనేది వుండదు. అందుకే నైజాంలో వరంగల్ శ్రీనుకు భారీగా అడ్వాన్స్ లు ఇచ్చిన ఎగ్జిబిటర్లు, ఆసియన్ సునీల్, శిరీష్ వంటి వాళ్లు, వెనక్కు ఇచ్చే డబ్బులు ఏవో, నేరుగా తమకే ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ దానికి వరంగల్ శ్రీను అంగీకరించలేదు. తనకు ఇస్తే, తాను ఎలా ఇవ్వాలో అలా ఇచ్చుకుంటా అంటున్నారు. ఇదంతా లైగర్ విడుదలయిన కొత్తలో సంగతి. అసలు మీరు మీరు తేల్చుకోండి, అప్పుడు చూద్దాం అని పూరి హ్యాపీగా రెండు వర్గల మధ్య తప్పుకున్నారు. పైగా పోలీస్ కంప్లయింట్ ఇచ్చి, తన ఇంటికి భద్రత ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పుడు మొత్తం మీద సినిమా విడుదలకు డేట్ వేసారు. డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న వస్తుంది. ఇప్పటి వరకు అంతా జరిగిపోయింది. ఆర్థికంగా కిందా మీదా పడినా మొత్తానికి సినిమాను పూర్తి చేసారు. సినిమా కోసం దాదాపు నలభై కోట్ల మేరకు ఫైనాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. సినిమాను మార్కెట్ చేయాలి. బయ్యర్లు రావాలి. థియేటర్ అడ్వాన్స్ లు రావాలి. అన్నీ క్లియర్ చేసుకుని సినిమాను విడుదల చేయాలి.
ఇలా జరగాలి అంటే టాలీవుడ్ నుంచి సహకారం అందాల్సి వుంటుంది. అలా అందాలి అంటే లైగర్ తలనొప్పులు క్లియర్ చేసుకోవాలి. మరి దానికి గాను పూరి- చార్మి ఏం చేస్తారో చూడాలి. పెద్ద బయ్యర్లు, ఎగ్జిబిటర్ల సహకారం లేకుండా సినిమాను విడుదల చేయడం కష్టం. మరి అందుకోసం ఏ విధంగా సెటిల్ మెంట్లు జరుగుతాయో చూడాలి.
మరో సరైన సినిమా అన్నది లేకపోవడం పూరి-చార్మి లక్. అదే కనుక మరో మంచి సినిమా వుండి వుంటే, ఎగ్జిబిటర్లు ఓ ఆట ఆడుకునే అవకాశం వుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు.