కొత్త హోంమంత్రి వంగలపూడి అనిత తన మార్క్ మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. ఇప్పుడు అధికారం పక్షంలో ఉండడంతో పాటు ఆమే హోంశాఖ మంత్రి కూడా. ఈ నేపథ్యంలో తన శాఖకు చెందిన పోలీస్ అధికారులకు అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.
మీడియాతో అనిత మాట్లాడుతూ పోలీస్ అధికారుల్లో కొందరు వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా వైఎస్ జగన్పై ప్రేమ వుంటే, ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వైసీపీ కోసం పని చేయాలని అనిత హితవు చెప్పారు. శాంతిభద్రతల విషయంలో తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.
అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా ఇంకా వైసీపీకి పోలీస్ అధికారులు కొమ్ము కాస్తున్నారని అనిత ఎందుకు భావిస్తున్నారో ఆమెకే తెలియాలి. ఒకవేళ వైసీపీకి ఎవరైనా కొమ్ముకాస్తున్నారని తెలిస్తే వారిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి వుంటుంది. ఆ విషయం తెలిసినా, పోలీస్ అధికారుల్ని ఆమె హెచ్చరించడం వెనుక కారణం ఏమై వుంటుందో మరి!
ఇప్పటికే వైసీపీ ముద్రపడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను దూరం పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. నేడో, రేపో అలాంటి అధికారులందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా బదిలీ ఆదేశాలు రానున్నాయి.