ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి పేరును చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌గా ఎవరి వైపు పవన్‌కల్యాణ్ మొగ్గు చూపుతారనే చర్చకు తెరలేచింది. డిప్యూటీ స్పీకర్ పదవికి జనసేనలో పోటీ నెలకుంది.
ప్రధానంగా బొలిశెట్టి శ్రీనివాస్, మండలి బుద్ధప్రసాద్, లోకం మాధవి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో మండలి బుద్ధప్రసాద్ గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. అయితే ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఆయన జనసేనలో చేరారు. టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో ఆయన పవన్ నాయకత్వంలో జనసేన జెండా కప్పుకున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రమే జనసేనలో మొదటి నుంచి ఉన్నారు.
పవన్‌కల్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం బొలిశెట్టి తీవ్ర కృషి చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ జనసేనను ఆయన వీడలేదు. మహిళా కోటాలో మాధవి వైపు మొగ్గు చూపే అవకాశం వుంది. లేదంటే జనసేనలో నిఖార్సైన నాయకుడిగా గుర్తింపు పొందిన బొలిశెట్టికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు పవన్ ఇష్టపడొచ్చని అంటున్నారు.