ఔను, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతే. రాజధాని ప్రాంతమైన అమరావతిని అభివృద్ధి చేస్తే, రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్టే. అందరూ అలా అనుకోవాలి. కూటమికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ఆమోదం దక్కినట్టే. అందుకే సీఎంగా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకోకమునుపే… అమరావతే రాజధాని అని, దాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి లెక్క తేలింది. అమరావతిని మూడు దశల్లో పూర్తి చేసేందుకు లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. మొదటి విడతలో రూ.48 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేయడం విశేషం. అమరావతిని పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రెండున్నరేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ఆయన ప్రకటించారు.
కేవలం అమరావతిపైనే లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టడానికి నిర్ణయించారంటే, ఇక మిగిలిన ప్రాంతాలను ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తారా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. రాష్ట్ర ఆదాయాన్ని అంతా అమరావతి కోసమే ఖర్చు పెడతారని స్పష్టమైంది. ఎందుకంటే, ఇంత పెద్ద మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశమే లేదు. భవిష్యత్‌లో అధికారంలోకి ఎవరొచ్చినా అమరావతిని రాజధానిగా మార్చకూడదంటే, పకడ్బందీగా నిర్మించాలనే ఉద్దేశంతోనే శరవేగంగా పనులు చేపట్టారు.
రాజధాని కోసమే లక్ష కోట్లు ఖర్చు చేస్తే, ఇక సాగునీటి ప్రాజెక్టులు, ఇతరత్రా అభివృద్ధి పనులకు ఎలా చేస్తారనే చర్చ మొదలైంది. చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అమరావతి నిర్మాణమే. దీనికి కారణాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ప్రాంతంలో ఎవరెవరికి ఎంతెంత భూములున్నాయో అసెంబ్లీ వేదికగా వివరించామని వైసీపీ నేతలు చెబుతున్నారు. వాటికి విలువ రావాలంటే అమరావతి నిర్మాణం జరిగాలి. ఇప్పుడు బాబు సర్కార్ ఆ పనే చేస్తోంది.
మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ ఏం చెబుతుందో చూడాలి. ఇప్పటి వరకైతే అమరావతి విషయంలో జెట్ స్పీడ్‌తో చంద్రబాబు సర్కార్ దూసుకెళుతోంది. అమరావతిని అభివృద్ధి చేయడం ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. అమరావతి కోసం తమను పస్తులు పెడతారేమో అని మిగిలిన ప్రాంతాలు భయపడుతున్నాయి. ఏమవుతుందో కాలం జవాబు చెప్పాల్సి వుంది.