పీఎం కిసాన్ 17వ విడత సాయాన్ని మోదీ సర్కార్ మంగళవారం అందించనుంది. పీఎం కిసాన్ సాయం కింద ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే… మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే.
ఈ సీజన్‌లో ఏపీలో మొత్తం 43.52 లక్షల మంది రైతులకు మొత్తం రూ.870 కోట్లు అందించనున్నారు. ఈ నేపథ్యంలో బాబు సర్కార్ హామీ ఇచ్చిన రైతు భరోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. రైతు భరోసా కింద ప్రతి ఏడాది రూ.20 వేలు చొప్పున అందిస్తామని చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాల పేరుతో భారీగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ఇప్పటికే ఒకేసారి ఐదు సంతకాలు కూడా చేశారు. ఇందులో సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసి నిరుద్యోగ ఉపాధ్యాయుల్ని కొంత మేరకు సంతృప్తిపరిచారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై సంతకం చేసి రైతుల్ని ఆనందపరిచినట్టు టీడీపీ భావిస్తోంది. ఇంత వరకూ అంతా బాగుంది.
పీఎం కిసాన్ నిధుల్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుండడంతో, బాబు సర్కార్ అందించే సాయంపై చర్చ జరుగుతోంది. బాబు సర్కార్ అందించే సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై ప్రకటన ఎప్పుడు చేస్తారా? ఏం చేస్తారా? అని రైతులు ఉత్కంఠగా ఉన్నారు. రైతు భరోసా కింద జగన్ ఏడాదికి రూ.16 వేలు ఇస్తానని ప్రకటించగా, చంద్రబాబు రూ.20 వేలు అనడంతో అంతా టీడీపీ వైపు మొగ్గు చూపారని రైతులు గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు వర్షాలు పడుతుండడం, రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో పెట్టుబడి సాయం ఎంతో అవసరం. అందుకే చంద్రబాబు అందిస్తానన్న రూ.20 వేలు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రైతాంగం అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం త్వరగా రైతు భరోసా నిధుల్ని జమ చేస్తుందని ఆశిద్దాం.
15000 crores lo 6000 crores raithu barosa ki