సింహాసనంపై ధీరోదాత్తుడు

ఆయన కార్యసమర్థత మీదనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రప్రజలు అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆయన కార్యకుశలత మీదనే వారు విశ్వాసం ఉంచారు. రాష్ట్రానికి ఆయన ముద్రగల అభివృద్ధి కావాలని అనుకున్నారు. రాజకీయం అంటేనే.. ఎత్తుపల్లాలు సహజం అనే సత్యాన్ని…

ఆయన కార్యసమర్థత మీదనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రప్రజలు అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆయన కార్యకుశలత మీదనే వారు విశ్వాసం ఉంచారు. రాష్ట్రానికి ఆయన ముద్రగల అభివృద్ధి కావాలని అనుకున్నారు. రాజకీయం అంటేనే.. ఎత్తుపల్లాలు సహజం అనే సత్యాన్ని స్వానుభవంలో కలిగిఉన్న చంద్రబాబునాయుడుకు పడి లేవడం అలవాటే! పీఠం ఎక్కడం, పడడం, తిరిగి లేవడం… నలభై నాలుగేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో  ఆయన రాటుదేలిపోయారు. కానీ గతంలో ఎదురైనవి కేవలం పరాజయాలు మాత్రమే. 2019లో ఎదురైన పరాజయం తర్వాత.. అనేకానేక పరాభవాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

సహనం, సంయమనం, దృఢమైన సంకల్పం, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడం.. ఇవన్నీ చంద్రబాబునాయుడును చెక్కుచెదరని ఉక్కుమనిషిగా నిలబెట్టాయి. ఆయన వ్యక్తిత్వ లక్షణాలే తిరిగి ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా, ఆయనకు మళ్లీ సీఎం సింహాసనం దక్కేలా చేశాయి. ఈ అయిదేళ్లలో ఎన్నో అవమానాల అగడ్తలను దాటారు.. వేధింపుల దుర్మార్గాలను ఓర్చుకున్నారు. తిరిగి తనను తాను రాష్ట్రఅభివృద్ధికి పునరంకితం చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుణవిశేషాల సమాహారమే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘సింహాసనంపై ధీరోదాత్తుడు’.

రాజకీయం ఒక క్రీడ. నైపుణ్యాల కంటె ఎక్కువగా అదృష్టం మీద ఆధారపడే జూదక్రీడ అనాలా.. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఒక్క చిన్న పొరబాటుతో ఓటమి అనివార్యం అయ్యే క్రికెట్ వంటి దారుణమైన క్రీడ అనాలా.. అనేది ఎవరెవరి అనుభవాలను బట్టి ఉంటుంది. ఇక్కడ గెలుపోటములు సహజం అనే సత్యాన్ని మాత్రం.. ఈ క్రీడా మైదానంలో తమ తమ జీవితగమనాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఆమోదించి తీరాల్సిందే.

దేశంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయానుభవం కలిగి ఉన్న నాయకుల్లో ఒకరు.. నలభై నాలుగేళ్ల అనుభవంతో.. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన నాయకుడు అయిన చంద్రబాబునాయుడుకు ఈ సత్యం తెలియదని అనుకోలేం. గెలుపోటములు అంటే.. కేవలం ఆయన ముఖ్యమంత్రి కావడమూ, ఓడిపోవడమూ మాత్రమే కాదు. రాజకీయ నిత్యక్రీడలో అనేకానేక వ్యూహాలు ఎత్తుగడల విషయంలో ఎదురయ్యే అనేకానేక అనుభవాలను కూడా కలుపుకుంటే.. ఈ సంత్యం ఆయనకు తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియకపోవచ్చు.

ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. 2019 తర్వాత ఎదురైన ప్రతి పరాభవాన్ని తట్టుకుని నిలవడానికి.. ప్రజల ఎదుట మళ్లీ తన కార్యదీక్షను నిరూపించుకోవడానికి, మళ్లీ తనకు ఒక అవకాశం ఇవ్వాలని అడగగలిగే ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి ఆయనలోని ఈ అనుభవమే చంద్రబాబుకు ఉపకరించింది.  ప్రారంభంలో చెప్పినట్టుగా ఈ అయిదేళ్లలో ఎన్నో అవమానాల అగడ్తలను దాటారు.. వేధింపుల దుర్మార్గాలను ఓర్చుకున్నారు. అంతటి సీనియర్ నాయకుడు అంత ఓర్పుతో అన్నిటినీ సహించి తనను తాను తిరిగి ముఖ్యమంత్రి పీఠం వైపు, ఆ రకంగా ప్రజల సేవలోకి నడిపించుకున్న దీక్షాతత్పరత కొనియాడదగినది. ఆయన తాను ఇప్పుడు మారిపోయిన చంద్రబాబును అని చెప్పుకున్నారు.

నిజానికి ఆయన గతంలో కూడా ఇలా చెప్పుకున్నారు. కానీ.. ఇప్పుడు ఫలితాల తర్వాత, ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఆయన వేస్తున్న అడుగులను గమనిస్తే.. ఆయన చెప్పుకోనక్కర్లేదు.. ప్రజలే గుర్తిస్తున్నారు.. నిజంగా ఆయన మారిపోయిన చంద్రబాబే! ఈ అయిదేళ్లలో ఆయన తన ధీరోదాత్తతను నిరూపించుకున్న ఉదాహరణలు చూద్దాం. 

మంత్రించి వదలిన బూతు అస్త్రాలు..

రాజకీయాల్లో నాయకుడు ఎవరైనా గానీ.. అనుసరించే ఒక వక్రనీతి ఉంటుంది. తన ప్రత్యర్థి మీదికి విమర్శల దాడి చేయించదలచుకున్నప్పుడు.. అదే కులానికి చెందిన వారిని ఎంచుకుంటూ ఉంటారు. లేదా.. అగ్రకులాల వారిని ఎస్సీ నాయకులతో తిట్టిస్తుంటారు. ఇలాంటి వక్రనీతికి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి .. ఎవ్వరూ అతీతులు కాదు. ఒక నాయకుడిని విమర్శించాలనుకుంటే.. ఏ సబ్జెక్టు మీదనో తేలిన తర్వాత.. ఆ సబ్జెక్టుకు సంబంధించిన నిపుణుడితో విమర్శింపజేయడం ఒక ఎత్తు. ఆ పద్ధతికి కొన్ని దశాబ్దాలుగా కాలం చెల్లింది. కులాలవారీగా ప్రత్యర్థిని తిట్టే అస్త్రాలను ప్రతి ఒక్కరూ సిద్ధం చేసుకోవడం మొదలైంది. ఆ క్రమంలో భాగంగా చంద్రబాబునాయుడును తిట్టిపోయడానికి జగన్ ఎంచుకున్న అస్త్రాలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులు!

జగన్ ‘హ్యాండ్ పిక్‌డ్’ నాయకులు తామే కావడంతో వారు మురిసిపోయారో ఏమో.. ప్రతి సందర్భంలోనూ హద్దులు దాటారు. కొడాలి నాని వాడే భాష.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఎంతటి బురదను, మరకలను అంటించిందంటే.. ఆ పార్టీ మనుగడలో ఉన్నంతకాలమూ ఆ మరకలను మోయవలసిందే. పచ్చి తాగుబోతులైన బజారు మనుషులనుంచి కూడా మనం అలాంటి భాష ఆశించలేం. ప్రతిసారీ బూతులు మాట్లాడడం తనకు ఉన్న ప్రివిలేజీ అన్నట్టుగా కొడాలి నాని చంద్రబాబునాయుడును, లోకేష్ ను తిట్టేవారు. నిజానికి జగన్ తలచుకుంటే ఆ భాషను కట్టడి చేయడం అనేది చిటికెలో పని! అలా జరగలేదు.

వల్లభనేని వంశీ భాషలోనే కాదు, బుద్ధిలోనూ తన నీచత్వాన్ని ప్రదర్శించుకున్న వ్యక్తి. ఆ వ్యాఖ్యలే నీచం అనుకుంటే.. వాటి మీద గౌరవ శాసనసభలో చర్చ జరగడం దానికి పరాకాష్ట. ఆరోజు సభలో చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని రాష్ట్రప్రజలందరూ కూడా ఈసడించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కన్నీళ్లు కూడా వారిని కదిలించాయి. ఇలాంటి అవమానాన్ని జగన్మోహన్ రెడ్డి తలచుకుంటే చిటికెలో ఆపి ఉండగలరు. కానీ.. జగన్ సేనలోని ఇద్దరు నాయకులు, ఆయన మంత్రించి వదలిన బూతు అస్త్రాల్లాగా చంద్రబాబును పదేపదే అవమానిస్తూ మాట్లాడడాన్ని ఆయన ఎంజాయ్ చేశారు.

అయితే ఆ అవమానాలను చంద్రబాబు ఓర్చుకోవడం ఒక ఎత్తు అయితే.. తనకు జరిగిన అవమానాలను ఒక ప్రచార అస్త్రంగా కూడా ఆయన మార్చుకున్నారు. నరసింహశతకంలో ఒక మాట ఉంటుంది.. ‘సేన చెడుగైన దండనాధుని తప్పు’ అని! అలా తాను ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులు చేసిన తప్పిదాలు జగన్మోహన్ రెడ్డికి కూడా అంటుకుంటాయని ఈ ఉదంతాలు నిరూపిస్తున్నాయి. 

అరెస్టు ఎపిసోడ్ ఒక దుర్మార్గం

చంద్రబాబునాయుడు పరిశుద్ధాత్మ స్వరూపుడు అని, నిష్కళంకుడు అని కితాబిస్తున్న వాక్యం కాదు ఇది. తక్కెడ పట్టిన చేయి తప్పు చేయకుండా ఉండదు అంటారు పెద్దలు. అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు.. తప్పు చేయకుండా ఏ నాయకుడైనా శుద్ధపూసగా తన కెరియర్ ను పూర్తిచేస్తారని అనుకోవడం భ్రమ. చంద్రబాబునాయుడు 2014 తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నప్పుడు.. అవినీతికి పాల్పడ్డారా లేదా? అనేదే వేరే సంగతి. అది ఎటూ న్యాయస్థానాల్లో తేలుతుంది. ఎప్పుడో నమోదు అయిన కేసులకు సంబంధించి.. ఆ నిర్దిష్ట సందర్భంలో చంద్రబాబును అరెస్టు చేయడం కూడా అంత కీలకంగా ప్రస్తావించదగినది కాదు. ఆయన పట్ల సీఐడీ పోలీసులు ప్రవర్తించిన, అరెస్టు చేసిన తీరు మాత్రం గర్హనీయమైనది.

చంద్రబాబునాయుడు అరెస్టు సందర్భంలో ఎంతటి హైడ్రామా సృష్టించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. పారిపోతున్న గజదొంగను పట్టుకోడానికి అన్నట్టుగా అర్ధరాత్రి పోలీసులు పెద్దఎత్తున ఆయన బసచేస్తున్న బస్సు చుట్టూ మోహరించి అరెస్టుకు ప్రయత్నించారు. కుదరక, తెల్లవారిన తర్వాత అరెస్టు చేశారు. అక్కడినుంచి చంద్రబాబునాయుడును రోడ్డు మార్గంలో అనేక రకాల మలుపులు, పల్లెలు తిప్పుతూ విజయవాడకు తీసుకువెళ్లారు. చంద్రబాబునాయుడు నేరం చేసే ఉండొచ్చు. కానీ.. 74 ఏళ్ల వృద్ధ నాయకుడనే అంశాన్ని కూడా పరిగణించకుండా.. హెలికాప్టర్ లో తరలించడానికి అవకాశం ఉండగా.. రోడ్డు మార్గంలో ఆయన ఒళ్లు హూనమయ్యేలా చేసి తీసుకువెళ్లడం కూడా ప్రజలు గుర్తించారు.

‘హెలికాప్టర్ పెడతాం అంటే.. ఆయనే వద్దన్నారు’ అని ప్రభుత్వం సమర్థించుకుంది. ఆ మాట అబద్ధం అని తర్వాత వినిపించింది. నిజమే అనుకున్నప్పటికీ.. ఒకసారి అరెస్టు అయిన తర్వాత, చంద్రబాబు నిందితుడు కదా! ఆయన అభిప్రాయాలతో పనేమిటి? పోలీసులు తమ అధీనంలో ఉన్న వ్యక్తిని నిరభ్యంతరంగా హెలికాప్టర్లో తీసుకువెళ్లి ఉండొచ్చు కదా.. అలా చేయలేదు. ఆరకంగా కూడా వారి తీరు ప్రభుత్వవైఖరిని భ్రష్టు పట్టించింది. ఈ పరాభవాన్ని కూడా చంద్రబాబునాయుడు తనకు అస్త్రంగానే వాడుకున్నారు. 

ఇవి కేవలం కొన్ని కీలకమైన ఉదాహరణలు మాత్రమే. సుదీర్ఘ అనుభవం ఇచ్చిన విజ్ఞత, సంయమనం చంద్రబాబు వద్ద పుష్కలంగా ఉన్నాయి. వివేకవంతుడు తన మీద కిట్టనివాళ్లు విసిరేరాళ్లను ఏరి, తన చుట్టూ దుర్గంగా నిర్మించుకుంటాడని పెద్దలు చెబుతారు. చంద్రబాబునాయుడు తన మీద విసిరిన రాళ్లతో కేవలం దుర్గం మాత్రమే కాదు.. వాటిని పదును పెట్టి తన అస్త్రాలుగా కూడా తయారుచేసుకున్నారు. తన మీద ఎవ్వరెంత బురద చల్లినా.. ఆ బురద మరకలతోనే ప్రజల ఎదుటకు వెళ్లి.. వారిని తీర్పు చెప్పమని అడిగారు. ప్రజలు ఆయన ఫ్లెక్సిలకు క్షీరాభిషేకాలు చేయలేదు. కానీ.. ప్రజలే తమ ఓటు తీర్పుతో ఆయనమీద చల్లబడిన బురద మరకలను మొత్తం తుడిచేశారు. ఆయనను సగౌరవంగా ముఖ్యమంత్రి సింహాసనంపై కూర్చుండబెట్టారు. నాలుగోసారి పట్టాభిషిక్తుడిని చేశారు. 

చంద్రబాబులో ‘మార్పు’పైనే రాష్ట్రం ఆశలు

తాను మారిన చంద్రబాబును అని ఆయన ఈ దఫా కూడా ప్రకటించుకున్నారు. కానీ గతంలో మాదిరిగా కాకుండా ఆయనలోని మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పెన్షన్ల విషయంలో చంద్రబాబును నమ్మడానికి వీల్లేదని, అంత డబ్బు తేవడం ఆయనకు అసాధ్యం అని, గెలిచిన తర్వాత అమలు చేయకుండా మోసం చేస్తాడనే ఆరోపణల మీదనే ప్రజలు ఆయనకు ఓటు వేయకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి శతథా ప్రయత్నించారు. కానీ జగన్ చెప్పినట్టుగా ప్రజలు చంద్రబాబును నమ్మకపోవడం కాదు కదా.. జగన్ ప్రచారాన్నే నమ్మలేదు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నారు. మొదటి రెండు సంతకాలు చెప్పినట్టే.. మెగా డీఎస్సీ, లాండ్ టైటిలింగ్ రద్దుపై పెట్టినా… చెప్పకపోయినా సరే.. మూడో సంతకం పెన్షన్ల పెంపుపై పెట్టడం విశేషం. నాలుగో సంతకం పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై పెట్టడం గొప్ప సంగతి. అయిదో సంతకం నిరుద్యోగులకు ఊరట కల్పించే నైపుణ్య గణనకు సంబంధించినది.

మారిన చంద్రబాబుకు ఇతర రుజువులు కూడా ఉన్నాయి. మంత్రి వర్గ కూర్పు విషయంలో ప్రత్యేకంగా అభినందించాల్సిందే. చంద్రబాబుతో ఎంతోకాలంగా కలసి పనిచేస్తున్న, ‘నేను గెలిస్తే చాలు మంత్రిని అవుతా’ అనే ధీమాతో చెలరేగుతూ వచ్చిన అనేకమంది సీనియర్లను ఆయన పక్కన పెట్టిన తీరును గమనించాలి. సాధారణంగా చంద్రబాబునాయుడు పార్టీలోని సీనియర్ల ఒత్తిడికి తలొగ్గుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో చివరినిమిషం వరకు నిర్ణయం తీసుకోలేని వైఖరి గతంలో మనం గమనించవచ్చు. కానీ ఈసారి అలా జరగలేదు. తమకు తిరుగులేదు అనుకునే చాలామందికి అసలు మంత్రిపదవులు దక్కలేదు. విలక్షణమైన కూర్పుతో మంత్రివర్గాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.

ఆయన కార్యసామర్థ్యం మీద ప్రజలకు చాలా ఆశలున్నాయి. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి ఏకైక రాజధానిగా ఆమోదించారని ఈ ఎన్నికలు నిరూపించాయి. మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అన్న జగన్ మాటలు ప్రజలకు నచ్చలేదు. కార్యనిర్వాహక రాజధాని అని జగన్ చెప్పినా, వచ్చే నెలలో విశాఖ వచ్చేస్తున్నా అని పలుమార్లు చెప్పినా.. ‘మూడు అనేది ఉత్తుత్తిగా చెప్పిన మాట- నిజానికి విశాఖ ఒక్కటే రాజధాని’ అని ఆయన మంత్రులు ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించాలని ప్రయత్నించినా.. యావత్ ఉత్తరాంధ్ర ఆ పార్టీని దారుణంగా తిరస్కరించింది.

కేవలం రెండే ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. జగన్ కు ఆ స్థాయి ఓటమి దక్కడం- చంద్రబాబు బాధ్యతను పెంచుతోంది. ఆయన అమరావతి రాజధానిని సత్వరం పూర్తి చేయాలి. ప్రజలు ఎందుకోసమైతే తనను నమ్మారో.. ఆ విషయాలన్నీ అందరికంటె బాగా ఆయనకే తెలుసు. వాటన్నింటినీ పూర్తి చేయడానికి ఆయన ఉత్సాహభరితులైన కొత్త సచివుల అండతో దూసుకుపోవాలి.

ఎన్డీయే కూటమి విజయంలో కీలక భూమిక పోషించిన పవన్ కల్యాణ్ గౌరవం తగ్గకుండా చంద్రబాబు చూసుకుంటూ ఉండడం కూడా గొప్ప విషయమే. ఎలాంటి అరమరికలు లేకుండా వారంతా కలిసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, పారిశ్రామిక పురోగతి, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు పునరంకితమై ప్రజలు వాంఛలను నెరవేర్చాలి. ఓరిమి ఉన్నవారికే విజయం దక్కుతుందనేది సామెత. చంద్రబాబునాయుడు అయిదేళ్లలో తన ఓరిమిని బహుధా నిరూపించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయనకు బహుప్రశస్తమైన విజయమూ దక్కింది.

ఇప్పుడు ప్రజల కలల భారాన్ని మోయడం ఆయన ఎదుట ఉన్న కర్తవ్యం. ఆయనకు సహకరించడం మిగిలిన వారి విధి. ప్రజలు ఆమోదం పొందిన వారికి సహకరించడం ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి విధి. ప్రతిపక్ష హోదా దక్కలేదనే చింత వీడాలి. ఆ హోదా కేవలం సాంకేతికం మాత్రమే. కానీ.. 11 మంది సభ్యులు ఉన్నా సరే.. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. తప్పుడు దారిలో నడిచినా.. వారిని అప్రమత్తం చేయడానికి అది సరిపోతుందని ఆయన గుర్తించాలి. నలభై శాతం ప్రజలు తమ వెంట ఉన్నారని జగన్ చెప్పుకుంటున్నారు. ఆ బలాన్ని గుర్తుంచుకోవాలే తప్ప.. 11 మంది సభ్యుల బలాన్ని పట్టించుకోకూడదు. ప్రజలే తన బలంగా.. ప్రభుత్వం- పరిపాలన దారితప్పకుండా కాపలా కాయాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా శాసనసభను వదలిపోకుండా.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలి.

చంద్రబాబునాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా.. అంతిమంగా ఎవ్వరైనా కోరుకునేది రాష్ట్రం మరియు ప్రజల అభివృద్ధి. ఎవరి ముద్ర వారిదిగా ఉంటుంది. అందరి అంతిమలక్ష్యం ఒకటే అయినప్పుడు.. అందరూ కలిసి పనిచేయడమే రాష్ట్రం అభిలషిస్తుంది. 

..ఎల్. విజయలక్ష్మి