ప్ర‌జాస్వామ్యం రాజ‌కీయం.. ఎప్పుడు ఎలాంటి మ‌లుపులు అయినా!

మొన్న‌టి వ‌ర‌కూ మోడీకి ఇండియాలో తిరుగులేద‌నుకున్నారు! ఇంకెన్నేళ్లు అయినా మోడీ రాజ‌కీయంలో ఉన్న‌న్నాళ్లూ మ‌రో మాట లేద‌నుకున్నారు! మోడీ కూడా అదే అనుకున్న‌ట్టుగా ఉన్నారు! అయితే ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయం ఎప్పుడు ఎలాంటి మ‌లుపులు అయినా…

మొన్న‌టి వ‌ర‌కూ మోడీకి ఇండియాలో తిరుగులేద‌నుకున్నారు! ఇంకెన్నేళ్లు అయినా మోడీ రాజ‌కీయంలో ఉన్న‌న్నాళ్లూ మ‌రో మాట లేద‌నుకున్నారు! మోడీ కూడా అదే అనుకున్న‌ట్టుగా ఉన్నారు! అయితే ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయం ఎప్పుడు ఎలాంటి మ‌లుపులు అయినా తిర‌గొచ్చు అని ప్ర‌జ‌లు 2024 ఎన్నిక‌ల‌తో మ‌రోసారి రుజువు చేశారు! కేంద్రంలో మ‌ళ్లీ మోడీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా.. గ‌తానికి, వ‌ర్త‌మానానికి చాలా తేడా ఉంది!

కేవ‌లం అదొక్క‌టే కాదు.. 2024 ఎన్నిక‌ల‌తో ప్ర‌జ‌లు తాము పాల‌కుల క‌న్నా చాలా చాలా తెలివైన వాళ్లం, తాము పాల‌కుల క‌న్నా చాలా ప‌వ‌ర్ ఫుల్ అని రుజువు చేశారు! అస‌లు రాహుల్ గాంధీ ఒక క‌మేడియ‌న్ అత‌డు కాంగ్రెస్ ను ఏం ఉద్ధ‌రిస్తాడు, రాహుల్ సార‌ధ్యం ఉన్నంత వ‌ర‌కూ కాంగ్రెస్ కోలుకునే ప్ర‌శ్నే ఉండ‌ద‌నుకుంటే.. ఇప్పుడు లోక్ స‌భ‌లో కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా త‌న స్థానాన్ని ఎంతో కొంత మెరుగు ప‌రుచుకుంది! కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాలు కూడా కోలుకున్నాయి. ప్ర‌త్యేకించి యూపీలో స‌మాజ్ వాదీ పార్టీ మెజారిటీ లోక్ స‌భ సీట్ల‌ను సాధించడం అనేది చిన్న విష‌యం అయితే కాదు!

దేశంలో మిగ‌తా ఎక్క‌డైనా అయితే మోడీ మాత్ర‌మే! యూపీలో మోడీకి తోడు యోగి కూడా ఉన్నాడు. భార‌తీయ జ‌న‌తా పార్టీ భావి ఆశాకిర‌ణంగా యోగి ఆదిత్య‌నాథ్ ను వాట్సాప్ యూనివ‌ర్సిటీ ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. అయితే యూపీ లోక్ స‌భ ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. ఆదిత్య‌నాథ్ వ‌చ్చే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం చాలానే క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అంటూ బీజేపీ మొన్న‌టి వ‌ర‌కూ ఎక్క‌డిక్క‌డ చెప్పుకుంటూ వ‌చ్చింది. అయితే డ‌బుల్ ఇంజ‌న్ వద్ద‌ని, రెండు ఇంజ‌న్ల‌తోనూ యూపీ ప్ర‌జ‌లు లింక్ ను తెంపుకోవ‌డానికి మొగ్గు చూపినా పెద్ద ఆశ్చ‌ర్యం లేని ప‌రిస్థితి!

ఉత్త‌రాదిన నిర‌క్ష‌రాస్య‌త ఎక్కువ‌, మ‌త‌పిచ్చి ఎక్కువ కాబ‌ట్టి.. అక్క‌డ శాశ్వ‌తంగా బీజేపీదే అధికారం అని కొంద‌రు విశ్లేష‌కులు కూడా నిట్టూర్చేవారు! అయితే వారి అంచ‌నాలు కూడా త‌ప్పాయి. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌మిళ‌నాడుకు మించిన స్థాయిలో తాము కూడా తీర్పునిస్తామ‌ని యూపీ ప్ర‌జ‌లు నిరూపించారు!  మ‌తం చాటున కూడా శాశ్వ‌త రాజ‌కీయం సాధ్యం కాద‌ని యూపీ ప్ర‌జ‌ల లోక్ స‌భ ఎన్నిక‌ల తీర్పు చాటి చెప్పింది!

ఇక ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ చిత్తుగా ఓడిపోవ‌డం కూడా ఒక‌ర‌క‌మైన మోనార్కీకి ప్ర‌జ‌లు చెక్ పెట్ట‌డ‌మే! జ‌గ‌న్ త‌న నుంచి డైరెక్ట్ గా ప్ర‌జ‌లు అనే విధానాన్ని తెచ్చేద్దామ‌ని ప్ర‌య‌త్నించాడు. 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇచ్చిన అతి విశ్వాసంతో జ‌గ‌న్ అదే శాశ్వ‌తం అనుకున్నాడు. ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు వీళ్లంతా ఉత్తుత్తే.. న‌న్ను చూసి ఓటేయండి అంటూ పిలుపునిచ్చే సాహ‌సం చేశాడు. అయితే ప్ర‌జాస్వామ్యంలో దేన్ని చూసైనా అతి విశ్వాసానికి పోకూడ‌దు, సాహ‌సాలు చేయ‌కూడ‌దు అని జ‌గ‌న్ విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల ఫ‌లితాల‌ను చూసి అర్థం చేసుకోవ‌చ్చు. ఆఖ‌రికి నీ విశ్వాసం ప్ర‌జ‌లే అయినా.. వారిని చూసి కూడా అతి విశ్వాసాల‌కు పోకూడ‌దు అని జ‌గ‌న్ పార్టీ ఎదుర్కొన్న ఫ‌లితాల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు!

ఇది ఇప్పుడు ఎదురుదెబ్బ‌లు తిన్న వారికే కాదు, ఇప్పుడు అధికారాల‌ను సంపాదించుకున్న వారికి కూడా పాఠ‌మే! త‌న‌కు 151 వ‌చ్చాయ‌ని జ‌గ‌న్ లోలోప‌ల ఏ అహంభావాల‌నో పెంచుకుని, ఎవ్వ‌రేం చెప్పినా వినాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌ను చేసింద‌ల్లా రైటే అనుకునే తత్వంతో వెళ్లి బోల్తా ప‌డ్డాడు! మ‌రి సొంతంగా 151 సీట్ల‌ను సాధించుకున్న జ‌గ‌న్ ప్ర‌భే ఐదేళ్ల‌కు ప‌రిమితం అయిన‌ప్పుడు ముగ్గురు క‌లిసి పోటీ చేసిన వారు త‌మ‌కు వ‌చ్చిన సీట్ల‌ను చూసేసి అతిగా వెళ్తే మాత్రం.. ఇది ప్ర‌జాస్వామ్యం అని గుర్తు చేయ‌క త‌ప్ప‌దు!

అధికారం అందింది కాబ‌ట్టి ప‌గ‌ల‌గొడ‌తం, విర‌గొడ‌తాం.. పేర్లు చెక్కేస్తాం, విగ్ర‌హాలు కూల్చేస్తాం, క‌క్ష సాధింపులు చేస్తాం, క‌ప్పాల‌ను క‌ట్ట‌మంటాం అన్న‌ట్టుగానే కూట‌మి రాజ‌కీయం సాగుతూ ఉంది! అస‌లే నారా లోకేషుడు త‌న ద‌గ్గ‌ర ఒక రెడ్ బుక్ ఉందంటూ చాన్నాళ్ల గురించి ఊద‌ర‌గొడుతున్నాడు. మ‌రి ఇప్పుడు లోకేష్ అదే ప‌నే పెట్టుకున్నా.. అందుకే త‌మ‌కు జ‌నాలు అధికారం ఇచ్చార‌నుకున్నా.. ఐదేళ్ల‌కు మ‌ళ్లీ ఎన్నిక‌లు ఉంటాయ‌నే విష‌యాన్ని గుర్తెరిగితే ఆయ‌న‌కే మంచిది!

-హిమ‌